Telangana Budget 2023: ఎన్నికల ఏడాదిలో తెలంగాణ సర్కార్ భారీ బడ్జెట్‌కు రూపకల్పన చేస్తోంది. ఈ ఏడాది వరాల వాన కురవడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈనెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టే 2023–24 వార్షిక బడ్జెట్ జనరంజకంగా ఉండబోతుందని బీఆర్‌ఎస్ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. పథకాలకు భారీగా నిధులు కేటాయించేలా సుమారు రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం మీడియాకు లీక్ చేసింది. అయితే భారీ బడ్జెట్ రూపొందిస్తున్న తెలంగాణ సర్కార్ నిధులు ఎక్కడి నుంచి తెస్తుందన్న ప్రశ్న ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఎదురవుతోంది. బడ్జెట్‌తోపాటు ఆదాయం కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారో పద్దుల్లోనే చూపించాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఎలా చూపుతుందన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.

బెడిసి కొడుతున్న నిధుల సమీకరణ ప్రయత్నాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, నిధులు రాలేదు. చివరికి అప్పులపై కూడా పరిమితి విధించారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ అనేది తెలంగాణ ప్రభుత్వానికి సవాల్‌గా మారనుంది. కేంద్రం నుంచి పన్నుల వాటా, గ్రాంట్ల రూపంలో కొండత వస్తాయని ఊహించుకోవడం.. తర్వాత ఊసురుమనడం రివాజుగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రూ.59 వేల కోట్లు వస్తాయని వేసుకుంటే నికరంగా వచ్చేది రూ.24 వేలకోట్లే. వచ్చే ఏడాది కూడా మహా అయితే మరో రెండు, మూడు వేల కోట్లు పెరుగొచ్చు. భారీగా పెరుగుదల మాత్రం ఉండదు. మరో వైపు అప్పులపై పరిమితి తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. బడ్జెట్‌లో ఎంత మేర అప్పులను లక్ష్యంగా పెట్టుకున్నా.. వాటి లక్ష్యం మేర బహిరంగ మార్కెట్ రుణాలను సాధించుకోవడం ఈజీ కాదు. ఈ క్రమంలో ఆదాయం పెంపునకు రకరకాల మార్గాలను అన్వేషించినట్లుగా తెలుస్తోంది.
ధరల పెంపు.. భూముల విక్రయంపైనే ఆశలు..
భారీ బడ్జెట్‌కు ఆదాయ సమీకరణకు అన్వేశించిన మార్గాల్లో ధరల పెంపు, భూముల విక్రయం ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో భూములను వేలం వేసి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజధానిలో భూముల వేలం ప్రారంబించిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాల్లో కూడా భూములు వేలం వేయాలన్న ఆలోచన చేస్తోంది. పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వ¯Œ టైం సెటిల్‌మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకాశాలతో బడ్జెట్‌లో అంచనాలను ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తోంది.

గుదింబండగా బకాయిలు.. వడ్డీలు
మరోవైపు తెలంగాణ సర్కార్‌కు బకాయిలు, అప్పులకు వడ్డీలు గుదిబండగా మారుతున్నాయి. ఇప్పటికే సుమారు రూ.4 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం వాటికి వడ్డీనే నెలకు రూ.20 వేల కోట్లు చెల్లిస్తోంది. మరోవైపు విద్యుత్ సంస్థకు, ఆర్టీసీకి, సింగరేణికి చెల్లించే బకాయిలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ అవసరాల కోసం ఆయా సంస్థల నిధులను మళ్లించింది. దీంతో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఎన్నికల బడ్జెట్ ద్వారా రాష్ట్రం అప్పు రూ.5 లక్షల కోట్లు దాటుదుందని తెలుస్తోంది. దీంతో ప్రజలపై మరింత భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.