Homeజాతీయ వార్తలుTS Aassembly Governor Speech: కేసీఆర్‌ సర్కార్‌ ను తిట్టలేదు.. అసెంబ్లీలో గవర్నర్‌ ఏం...

TS Aassembly Governor Speech: కేసీఆర్‌ సర్కార్‌ ను తిట్టలేదు.. అసెంబ్లీలో గవర్నర్‌ ఏం చేశారంటే?

TS Aassembly Governor Speech: దాదాపు రెండేళ్లగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను రెండేళ్ల తర్వాత గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభించేందుకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ముందుకు వచ్చింది. అయితే రెండేళ్ల విభేదాల నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే శుక్రవారం ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ తమిళిసై కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించారు. సుమారు 30 నిమిషాలు సాగిన ప్రసంగంలో ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రసంగం కాపీని దాటి వ్యాఖ్యలు చేయలేదు. తెలంగాణ అభివృద్ధిలో దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్పు కనిపిస్తోందని తెలిపారు. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రుల కృషి ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అనేక విజయాలు సాధించిందని వెల్లడించారు.

TS Aassembly Governor Speech
TS Aassembly Governor Speech

దేశానికే తెలంగాణ ఆదర్శం..
కాళోజీ వాక్కులతో గవర్నర్‌ తమిళిసై ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అని కాళోజీ అన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. రాష్ట్రం పెట్టుబడుల స్వర్గధామంగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో నిర్మించాం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది’’ అని తమిళిసై వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం అపూర్వమైన విజయాలను సాధించిందని ఆమె అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ అవతరిస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో సీఎం, మంత్రుల కృషి ఎంతో ఉందని అన్నారు. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంలా మారిందని అన్నారు. సంక్షోభం, అభివృద్ధిలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలూ విద్యుత్‌ సరఫరా ఉందని తెలిపారు.

తల్లడిల్లిన పరిస్థితి నుంచి బయటపడి..
తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నది వెల్లడించారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారైందని తెలిపారు. ‘పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతుంది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపులోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది’ అని చెప్పారు.

TS Aassembly Governor Speech
TS Aassembly Governor Speech

పెరిగిన ప్రభుత్వ ఆదాయం..
2014–15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం.. ప్రభుత్వ కృషితో 2021 నాటికి రూ.1.84 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.1.24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022–23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు. ఇందుకు సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న కృషి బాగుందని ప్రశంసించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version