
MLA Chinnam Durgaiah: “నేను ఆరిజన్ పేరుతో ఒక డెయిరీ ఏర్పాటు చేస్తే.. దానికి మంచిర్యాల ఎమ్మెల్యే దుర్గయ్యను ఆహ్వానించాను. కానీ ఆయన నాకు పడక సుఖం అందించేందుకు ఒకరిని పంపించాలని కోరాడు” అంటూ ఆ డెయిరీ సీఈవో శైలజ చేసిన ఆరోపణలు గత మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ డెయిరీ ఏంటి? దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? దీనిపై విశ్లేషణాత్మక కథనం..
డెయిరీ కాదు..పచ్చి మోసం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో డెయిరీ యూనిట్ ఏర్పాటుకు స్థలం విషయంలో డబ్బు తీసుకొని తమను మోసం చేశారంటూ ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్యపై ఆరిజన్ డెయిరీ సంస్థ సీఈవో బోడపాటి శైలజ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ సంస్థపైనా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఆరిజన్ డెయిరీ సంస్థ రైతులను నమ్మించి నట్టేట ముంచింది. సంస్థ మోసాలపై ఎంతోమంది రైతులు పోలీసులను ఆశ్రయించారు. తమ సంస్థలో ఒక రైతు రూ.3.5 లక్షలు పెట్టుబడిగా పెడితే రూ.6 లక్షల విలువైన పాడిగేదెలను ఇస్తాం అని ఆరిజన్ సంస్థ ఆశపెట్టింది. మార్కెట్ రేటు కన్నా ఎక్కువ ధర ఇచ్చి పాలు కొంటాం అని రైతులకు ఆరిజన్ సంస్థ ప్రచారం చేసింది. ఫలితంగా పలువురు రైతులు ముందుకొచ్చారు. అనంతరం గ్రామాల్లో పాడి రైతులకు సేవలందిస్తున్న ‘పశుమిత్ర’లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా, ఏజెంట్లుగా నియమించుకున్న సంస్థ, జిల్లా వ్యాప్తంగా పాడి రైతుల నుంచి దాదాపు రూ.కోటి వరకు డిపాజిట్ల రూపంలో సేకరించింది. అయితే సంస్థ నిర్వాహకులు నెలలు గడిచినా గేదెలు ఇవ్వకపోవడంతో సదరు రైతులు పోలీసులను ఆశ్రయించారు. డెయిరీ సంస్థ ఎండీ కందిమళ్ల ఆదినారాయణ, సీఈవో బోడపాటి శైలజపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఆశ పెట్టి నిండా ముంచారు
వేలల్లో జీతాలిస్తామని, ప్రోత్సహకాలూ ఉంటాయని ఆశపెట్టి పశుమిత్రలను విధుల్లోకి తీసుకున్న ఆరిజన్ డెయిరీ నిర్వాహకులు, వారితోనూ రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టించారు. జైపూర్‌లోని వెటర్నరీ హాస్పిటల్‌లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు ఉద్యోగానికి రాజీనామా చేసి డెయిరీ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా చేరాడు. అలాగే మరో నలుగురైదుగరిని డైరెక్టర్లుగా, మేనేజర్లుగా చేర్చుకున్నారు. వీరితోపాటు చాలా మంది పశుమిత్రలు ఏజెంట్లుగా సంస్థలో పని చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల పేర్లు వాడుకొని
ఆరిజన్ డెయిరీ నిర్వాహకులు వివిధ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పశుసంవర్ధకశాఖ అధికారుల పేర్లు వాడుకుంటూ కార్యకలాపాలు నిర్వహించారు. నిరుడు ఆగస్టులో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరుకాగా అప్పటి పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ శంకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఓ రైతుకు నిర్వాహకులు గేదెల యూనిట్‌ను అందజేశారు. ఇన్సూరెన్స్ పేరిట ఒక్కో గేదెకు రూ.708 చెల్లించాలని, ఒకవేళ అది మరణిస్తే 50వేల వరకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. స్వయంగా ఎమ్మెల్యే భూమి పూజకు హాజరవడంతో రైతులు నమ్మి డబ్బులు చెల్లించినట్లు సమాచారం. కాగా దళితబంధు ద్వారా డెయిరీ యూనిట్లు పొందేందుకుఆరిజన్ నిర్వా హకులు భావించినట్లు సమాచారం.