Bengaluru Techie
Bengaluru Techie: కోటి విద్యలు కూటికోసమే అంటారు పెద్దలు.. దేశంలో ఉద్యోగావకాశాల కోసం చదువురాని కూలీల నుంచి ఉన్నత చదువులు చదివిన విద్యావంతుల వరకు వలస వెళ్తున్నారు. వెళ్లాల్సిందే. ఎందుకంటే ఉన్న ఊరిలో ఉపాధి ఇప్పుడు కష్టంగా మారింది. ఉపాధి(Employement) దొరికిన్నా ఎదుగుదల ఉండదు. అందుకే ఎక్కువ ఆదాయం కోసం చాలా మంది వలస వెళ్తున్నారు. అయితే వలస వెళ్లినా లాభం లేదని తాజాగా బెంగళూరుకు చెందిన ఓ టెకీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. బెంగళూరులో జీవనం కష్టతరమని, రూ.25 లక్షల వార్షిక వేతనం సంపాదించే ఓ కార్పొరేట్ ఉద్యోగి(Corporate employ) పోస్ట్ చేశాడు.
పూణె నుంచి బెంగళూరుకు..
ఈ ఉద్యోగి పూణే(Pune)లో రూ.18 లక్షల వేతనం పొందుతూ ఉండగా, 40 శాతం ఎక్కువ జీతం కోసం బెంగళూరుకు మారారు. అయితే, ఒక సంవత్సరం తర్వాత ఆ నిర్ణయాన్ని పశ్చాత్తాపపడుతూ, లింక్డ్‌ఇన్‌లో తన అనుభవాన్ని పంచుకున్నారు. బెంగళూరు(Bangloor)లో రూ.25 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ, అధిక ఖర్చుల వల్ల ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్నేహితుడితో మాట్లాడుతూ, ‘నగరాలు మారకూడదు, పూణే చాలా బాగుంది‘ అని చెప్పారు. స్నేహితుడు 40 శాతం జీతం పెరుగుదల ఆకర్షణీయంగా ఉందని అన్నప్పుడు, ఆ ఉద్యోగి బెంగళూరు జీవన ఖర్చుల గురించి వివరించారు. అద్దెలు అధికంగా ఉండటం, ఇంటి యజమానులు మూడు నుంచి నాలుగు నెలల అడ్వాన్స్ డిమాండ్ చేయడం, విపరీతమైన ట్రాఫిక్(Hevy Traffic) సమస్యలు తన ఆర్థిక, మానసిక స్థితిని దెబ్బతీశాయని చెప్పారు. ‘పూణేలో 15 రూపాయల వడాపావ్ మిస్ అవుతున్నా. అక్కడ జీవనం సరళంగా, సేవింగ్స్ కూడా సాధ్యమయ్యేవి‘ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందిస్తున్న నెటిజన్లు..
ఈ లింక్డ్‌ఇన్ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై విభిన్న రీతిలో స్పందించారు. కొందరు బెంగళూరు ఉద్యోగ అవకాశాలను సమర్థిస్తే, మరికొందరు అక్కడి ఖర్చులు, జీవన ఒత్తిడిని ఎత్తి చూపారు. ఒకరు, ‘బెంగళూరులో జీతం ఎక్కువైనా ఖర్చులు దానికి తగ్గట్టు పెరుగుతాయి‘ అని వ్యాఖ్యానించగా, మరొకరు, ‘పూణేలో జీవన నాణ్యత బెంగళూరు కంటే ఉత్తమం‘ అని అన్నారు.
ఈ సంఘటన భారత నగరాల్లో జీవన వ్యయం, ఆర్థిక సమతుల్యతపై చర్చకు దారితీసింది. ఎక్కువ జీతం కోసం నగరాలు మారినా, జీవన నాణ్యత, ఆర్థిక ఆదాయం మధ్య సమతుల్యత కీలకమని ఈ అనుభవం తెలియజేస్తోంది.