Viral Video: ఎవడి పిచ్చి వాడికి ఆనందంగానే ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం అనేక మంది పిచ్చిపిచ్చి వేశాలు కూడా వేస్తున్నారు. ప్రమాదకరంగా స్కిట్లు చేస్తున్నారు. చేయకూడని ప్రదేశాల్లో డాన్సులు చేస్తున్నారు. ఇదంతా వ్యూస్, లైక్స్, షేర్ల కోసమే. సోషల్ మీడియా వచ్చాక ఈ పిచ్చి మరింత పెరిగింది. అయితే కొందరు సోషల్ మీడియాను తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతున్నారు. అయితే కొందరు మాత్రం పిచ్చిపిచ్చి స్కిట్స్, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వ్యూస్, లైక్స్, షేర్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాము ఇబ్బంది పడడమే కాకుండా ప్రజలను, ప్రయాణికులను, వాహనదారులనూ ఇబ్బంది పెడుతన్నారు. కొందరు మెట్రో రైళ్లు, బస్సులలో డాన్సులు చేస్తున్నారు. కొందరు రోడ్లపై స్టంట్స్ చేస్తున్నారు. కొందరు పట్టాల మధ్యలో, ఎత్తయిన కొండలు, వంతెనలపై ప్రమాదకరంగా వీడియోలు షూట్ చేస్తున్నారు. ఇలా చేస్తూ చాలా మంది ప్రమాదాలకు గురయ్యారు. అయినా కూడా ఇప్పటికీ కొందరు ఇలాంటి స్కిట్స్ చేస్తూ తాము ఇబ్బంది పడుతూ.. ఇతరులనూ ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా ఓ యూట్యూబర్ కూడా ఇలాగే పిచ్చి వేషాలతో హైదరాబాద్ వాసులను ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బు మదంతో రద్దీ ప్రదేశాల్లో రోడ్లపై నోట్లు వెదజల్లుతూ పాదచారులను, వాహనదారులను ఇబ్బంది పెడుతున్నాడు. ఈ మేరకు అక్కడ ముందే ఏర్పాటు చేసుకున్న తన సిబ్బందితో వీడియో తీయించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నాడు.
రద్దీ రోడ్లపైనే షూటింగ్స్..
హైదరాబాద్‌లోని మోతీనగర్ పరిధి పర్వత్‌నగర్‌కు చెందిన వంశీ పవర్(హర్ష) ఓ యూట్యూబర్. ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్ తెరిచి తరచూ పలు అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఇటీవల పలుచోట్ల డబ్బులు దాచిపెడుతూ ముందుగా వచ్చి నగదు తీసుకుని లబ్ధి పొందాలని ఫాలోవర్స్‌కు సూచనలు చేస్తూ లైవ్ వీడియోలు చేశాడు. అంతటితో ఆగకుండా రద్దీగా ఉన్నా పలుచోట్లు జనంలోకి వెళ్లి ఒక్కసారిగా నోట్లను విసిరేయడం, ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేయడం చేశాడు. జూన్‌లో కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో డబ్బులను గాల్లోకి విసిరేశాడు. వాటిని ఏరుకోవడానికి జనం గుమిగూడటం వంటి దృశ్యాలను తీసి తన ఇన్‌స్టా ఖాతాలో అప్లోడ్ చేశాడు. నగదును ఏరుకోవడానికి జనాలు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. అసలే బిజీ రోడ్డు కావడం, రోడ్డుపై ఉన్న వారంతా కరెన్సీ నోట్ల కోసం అడ్డదిడ్డంగా పరుగెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 50 వేల రూపాయల విలువైన వంద నోట్లను వంశీ పవర్ గాల్లోకి విసిరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో దీనికి వ్యూస్ వచ్చాయి.
యూట్యూబర్ తీరుపై విమర్శలు..
అయితే, ఆ యూట్యూబర్ తీరుపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అతడు చేసిన పనికి రద్దీ రోడ్లపై గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, అటువంటి అనాలోచిత పనులు మానుకోవాలని కామెంట్లు చేశారు. పోలీసులు పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి వీడియోలు తీయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వీడియోలు వైరల్‌గా మారడంతో నిందితుడిపై కూకట్‌పల్లి పోలీసులు ’న్యూసెన్స్’ కేసు నమోదు చేశారు.
చివరకు అరెస్ట్..
కేసు నమోదు చేసినా తన రీల్స్ పిచ్చి మానలేదు. రహదారులపై డబ్బులు చల్లుతూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు పెడుతున్నాడు. నడిరోడ్డుపై డబ్బులు వెదజల్లడంతో ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు శుక్రవారం(ఆగస్టు 23న) అరెస్టు చేసి కటకటాల్లో వేశారు.
A Influencer in Hyderabad flew money in crowd road and make reel to gain subscriber and viewership #Reels pic.twitter.com/6UtM2NHfWd
— Stock Trader’s Bridge (@bridge_stock) August 22, 2024