
Ali: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నటుడు అలీ గ్రౌండ్ ప్రీపేర్ చేసుకుంటున్నారా? ఇప్పటికే ఓ నాలుగు నియోజకవర్గాలపై కన్నేశారా? ఇప్పటికే సొంతంగా సర్వేలు చేయించుకున్నారా? వైసీపీ హైకమాండ్ టిక్కెట్ ఇస్తే సొంతంగా రూ.30 కోట్ల వరకూ ఖర్చుపెట్టేందుకు రెడీ అయ్యారా? తన మనసులో ఉన్న మాటను అధినేత జగన్ చెవిలో పడేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి చట్టసభల్లో అడుగుపెట్టాలన్న ఆకాంక్ష అలీది ఇప్పటిది కాదు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనల నుంచి బరిలో దిగుతారని ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కుదరలేదు. దీంతో ప్రచారానికే పరిమితమయ్యారు. పార్టీ అధికారంలోకి రావడంతో ఎలక్ట్రానిక్ మీడియా సలహదారు పదవి కట్టబెట్టారు.
కానీ అలీ నామినేటెడ్ పదవితో సంతృప్తి పడలేదు. ప్రత్యక్ష ఎన్నికలపైనే తన ఫోకస్ పెంచారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు ఏకంగా పవన్ కళ్యాణ్ పై పోటీ చేయడాని సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే దీనిపై పవన్ అభిమానులు అలీని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.అయితే పవన్ పై పోటీ అన్నది ఉత్తమాటేనని తెలుస్తోంది. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గి ఎమ్మెల్యేను కావాలన్న బలమైన ఆకాంక్ష మాత్రం అలీలో ఉంది. అందుకే తనకు అనువైన నియోజకవర్గాలు ఏవో ఆరాతీయడం ప్రారంభించారు. సామాజికవర్గం, సినీ గ్లామర్ తో నెగ్గుకు రాగలనన్న నాలుగు నియోజకవర్గాలను అలీ ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.
గుంటూరు ఈస్ట్ , కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ స్థానాలు అలీ మనసులో ఉన్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో సర్వేు చేయించుకున్న అలీ ఎక్కడ నుంచి పోటీచేసిన గెలుపుబాట పడతానన్న నమ్మకంతో ఉన్నారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే అలీ చెప్పినదంతా విన్న జగన్.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదట. అలీ సినిమా పరంగా మంచి నటుడే కావచ్చు.. అంతకంటే ఎక్కువ పేరున్న వ్యక్తే కావచ్చు. కానీ నటన, రాజకీయం వేరు అనేది ఇప్పటి వరకూ రీల్ నుంచి రియల్ లైఫ్ పాలిటిక్స్‌లోకి వచ్చిన పలువురి విషయాల్లో నిరూపితమైంది. పైగా రానున్న ఎన్నికల్లో ఎలా గెలవాలని.. ఏం చేస్తే గెలుస్తామని కాకలు తీరిన నేతలే అర్థం కాక జుట్టు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అలీ పోటీచేస్తే ఏ మాత్రం గెలుస్తారనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

తనకు కానీ టిక్కెట్ ఇస్తే రూ.30 కోట్లు వరకూ ఖర్చుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు అలీ హైకమాండ్ కు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఆ నాలుగు నియోజకవర్గాలను హేమాహేమీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి మహ్మద్ ముస్తాఫా షేక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత రెండుసార్లు టఫ్ ఫైట్ లో అతి కష్టమ్మీద నెగ్గుకొచ్చారు. ఈసారి కూడా పోటీచేసి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కర్నూలు సిటీ విషయానికి వస్తే 2014 ఎన్నికల్లో ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. టీడీపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరారు. కానీ టిక్కెట్ దక్కలేదు. అబ్ధుల్ హఫీజ్ ఖాన్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేశారు. 5353 ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు టిక్కెట్ నాకంటే నాకు అంటూ మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. కడప విషయానికి వస్తే గత రెండు ఎన్నికల్లో అంజాద్ భాషా గెలుపొందుతూ వస్తున్నారు. మరోసారి పోటీకి సిద్ధపడుతున్నారు. రాజమండ్రి రూరల్, అర్బన్ లో కూడా సీనియర్ నేతలు కాచుకొని కూర్చున్నారు. ఇటువంటి సమయంలో అలీ ఆ నాలుగు నియోజకవర్గాలపై మనసు పెంచుకోవడం వృథా ప్రయాసేనని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.