
AP And Telangana Key Projects: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. కీలక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. ఏకంగా రూ.52,125 కోట్ల నిధులతో ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించింది. ఇందులో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు ఏపీ తెలంగాణను కలుపుతూ ఉన్న రైల్వే లైన్ ను డెవలప్ చేయడానికి నిర్ణయించింది. కేంద్ర గతిశక్తి ప్లాన్ కింద దేశ వ్యాప్తంగా కీలక పనులు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించింది. ఇందుకుగాను రూ.4.53 లక్షల కోట్లు కేటాయించింది. మొత్తం 63 ప్రాజెక్టులను గుర్తించింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఏడు ప్రాజెక్టులు ఉండడం విశేషం. ఇప్పటికే జాతీయ రహదారుల నిర్మాణంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు ఏపీ, తెలంగాణను కలుపుతూ రైల్వేలైన్ కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఉపశమనం కలిగించే విషయం.
ఇప్పుడు ఏపీలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల పెంపు పై కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్ లో ఏపీలో జాతీయ రహదారుల కోసం 4,955 కోట్లు మంజారు చేసింది. ఇప్పుడు గతిశక్తి ప్లాన్ లో భాగంగా ఎంతో కాలంగా పెండింగ్ డిమాండ్ గా ఉన్న గుంటూరు-బీబీనగర్ రైల్వే లైను డబులింగ్ పనులకు పచ్చజెండా ఊపింది. దానితోపాటు విశాఖపట్నం పోర్ట్ లాజిస్టిక్స్ పార్కు పనులకు నిధులు కేటాయించింది. గుంటూరు నుంచి బీబీనగర్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే లైన్ డబులింగ్ డిమాండ్ దాదాపు రెండు దశాబ్దాలుగా ఉంది. దీనికి సంబంధించి కేంద్రానికి పలు ప్రతిపాదనలు అందాయి. ఈ లైన్ డబ్లింగ్ పూర్తయితే, తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణం వేగం పెరగటంతో పాటుగా రైళ్ల సంఖ్య పెరగనుంది.
విశాఖ రాజధానికి వైసీపీ ప్రయత్నిస్తుండగా.. ఇప్పుడదే సాగర నగరానికి కేంద్రం ప్రాధాన్యమివ్వడం విశేషం. విశాఖకు ఇస్తున్న ప్రాధన్యతకు కొనసాగింపు లో భాగంగా.. కేంద్రం తాజాగా విశాఖపట్నం పోర్ట్ లాజిస్టిక్స్ పార్కుకు రూ 255 కోట్లు కేటాయించింది. ఇప్పటికే పర్యాటకంగా విశాఖకు కేంద్రం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. లాజిస్టిక్ పార్కు నిర్మాణంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే కాకుండా జాతీయ స్థాయి గుర్తింపు దక్కే చాన్స్ ఉంది. దశాబ్దాలుగా పెండింగ్ డిమాండ్ అయిన ఈ పార్కుకు ఏకంగా నిధులు కేటాయించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

దేశవ్యాప్తంగా దాదాపు రూ. 4.53 లక్షల కోట్ల విలువైన 63 ప్రాజెక్టులను గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌లో చేర్చడానికి నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూపు (పీఎన్‌జీ) గుర్తించింది. రహదారుల శాఖకు చెందిన రూ.299476.4 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులు ఉండగా… రూ.79015.7 కోట్ల విలువైన ఎనిమిది పట్టణాభివృద్ధి శాఖ ప్రాజెక్టులు, రూ.47041.2 కోట్ల విలువైన 21 రైల్వే ప్రాజెక్టులు, రూ.12780.6 కోట్ల విలువైన ఐదు వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రాజెక్టులు, రూ.9056 కోట్ల విలువైన నాలుగు పెట్రోలియం, సహజవాయువుల ప్రాజెక్టులు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు ఈ ప్లాన్ కింద రూ.53,125 కోట్లు కేటాయించారు. ఏడు ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. మరో ప్రాజెక్టు అంచనా వ్యయం ఖరారు కావాల్సి ఉంది.