
AP Politics: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్నా, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఆవహిస్తోంది. అభ్యర్థుల ప్రకటనకు అంశాన్ని ప్రధాన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు విశ్లేషణలు జరుపుతున్నాయి. ఇవన్నీ ఒకవంతయితే, మెరుగైన ఓటింగ్‌ను రాబట్టుకోవడం మరో వంతు. అన్ని వర్గాలను కలుపుకొని వెళితేనే గెలుపు సునాయసమవుతుంది. ఆ మేరకు ఏపీలో ఒక కొత్త కూటమి ఆవిష్కరణ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
వ్యతిరేకతను చేజారకుండా..
రాష్ట్రంలో వ్యతిరేక ఓటు చేజారకూడదని టీడీపీ భావిస్తుంది. జనసేన కూడా అదే విషయాన్ని ప్రజలతో, పార్టీ నాయకులతో అంటోంది. వైసీపీని ఓడించడమే ప్రధాన అజెండా అని ఇరు పార్టీలు ప్రకటించాయి. అయితే, పొత్తులతో మాత్రం ఇంకా స్పష్టత లేనట్లుగానే కనబడుతున్నారు. వైసీపీ మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది. గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలు లోపాయికారీగా జగన్ కు సహకరించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అధికార పార్టీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ఆ పార్టీలు ప్రకటించాయి.
కలిసొచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీ, టీడీపీలకు ఓటు సమీకరణపై ఒక అవగాహనకు వచ్చాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలిబడిన పీడీఎఫ్‌కు టీడీపీ సహకరించేలా ఒప్పందం చేసుకుంది. మొదటి ప్రాధాన్య ఓటు టీడీపీకి వేసి, రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంటే దాదాపుగా సీపీఐ, సీపీఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ కలిసి వెళ్లేందుకు సానకూలంగానే ఉన్న సంకేతాలను ఇస్తుంది. మరో వైపు జనసేన కూడా వామ పక్ష పార్టీలతో కలిసినడిచేందుకు సుముఖంగా ఉంది. పవన్ కల్యాణ్ వామపక్ష భావాలను చాలాసార్లు పలు మీటింగులలో ప్రకటించారు కూడా.

బీజేపీ ఎందుకు?
వాస్తవానికి బీజేపీకి ఏపీలో ఒక శాతం ఓటింగ్ కూడా లేదు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల కలుపుకొని వెళ్లేందుకు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. సోము వీర్రాజు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేస్తున్న దాఖలాల్లేవు. ఉన్న నాయకత్వం కూడా అధికార లేదా ప్రతిపక్షాలకు సహకరిస్తూ కాలం గడుపుతుంది. సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వెళ్లిపోయారు. దాంతో ఆ పార్టీని కేంద్రం ఎంతగా ఆయువు పోస్తున్నా పట్టును నిలపుకునే స్థితిలో లేదు.
ప్రతిపక్షాలన్నీ ఒక కూటమి?
బీజేపీతో పొత్తుకు టీడీపీ ఒప్పుకోవటం లేదు. పొత్తు పెట్టుకున్న జనసేన కూడా రాబోవు ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉంటే నష్టమేనన్న భావనకు వస్తుంది. అయితే, వైసీపీని చెక్ పెట్టేందుకు తప్పని పరిస్థితుల్లో కమల దళాన్ని కలుపుకుని వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. ఇలా చేస్తే మోడీ ప్రభుత్వ అరాచక పాలనను మోయాల్సి వస్తుంది. కొన్ని వర్గాలు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. వామపక్ష పార్టీలు రాష్ట్రంలో శాసించే స్థితిలో లేకపోయినా, అనుబంధ కమిటీలు బలంగానే ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిదే పైచేయిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేనలు, వామపక్ష పార్టీలతో కలిసి ఒక నయా కూటమి ఏర్పాటు జరిగితే వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీని భూస్థాపితం చేయవచ్చేనే ఆలోచనకు వస్తున్నట్లున్నారు.