దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశంలో 60,000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఈ వైరస్ గురించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడా యునివర్సిటీ పరిశోధకులు కరోనా వైరస్ గురించి విసృతంగా పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కరోనా వైరస్ ఆరు అడుగుల దూరం కంటే ఎక్కువ దూరం వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
వినడానికి కొంత షాకింగ్ గా అనిపించినా వైరస్ గురించి వెల్లడవుతున్న విషయాలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. సాధారణంగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాత్రమే కరోనా వైరస్ సోకుతుందని ఇప్పటివరకు చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ మాట్లాడినపుడు, అరిచినప్పుడు కూడా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా నోట్లో నుంచి వచ్చే తుంపరల ద్వారా బయటకు వస్తున్న వైరస్ కణాలు అంతకంతకూ పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆరడుగుల భౌతిక దూరం ఏ మాత్రం సరిపోదని అభిప్రాయపడ్డారు. ప్రజలు భౌతిక దూరం పాటించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తాము చేసిన పరిశోధనల ఫలితాలను పరిశీలించి కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలించాలని అన్నారు.