
దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరినుంచి వైరస్ సోకుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జనం గుంపులుగుంపులుగా గుమికూడే ప్రాంతాల్లో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. ఒకే చోట ఎక్కువమంది ఉంటే ఒక్కరికి వైరస్ సోకినా ఇతరులకు అంతే వేగంతో వ్యాప్తి చెందుతోంది.
మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా ధాటికి మహారాష్ట్ర గజగజా వణుకుతోంది. ప్రజలు, పోలీసులు, జైలు సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. మహారాష్ట్రలో ని 292 జైళ్లలో 1000 మందికి పైగా ఖైదీలు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడిన వాళ్లలో 814 మంది ఖైదీలు, 286 మంది సిబ్బంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు ఆరుగురు ఖైదీలు మాత్రం చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. జైళ్లలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కరోనా నిర్ధారణ అయిన జైళ్లలో శానిటైజేషన్ చేస్తున్నారు. అదే సమయంలో జైళ్లలో కరోనా కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జైళ్లలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఖైదీలను జైళ్ల నుంచి విడుదల చేస్తున్నారు.