Telangana Congress: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. గడచిన మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. కానీ ఇప్పటికి ఆ పార్టీలో జాప్యం.. నిర్లక్ష్యం.. కొనసాగుతూనే ఉన్నాయి.. అసలు ఈ పరిస్థితికి కారణమెవ్వరు.. ఇలానే కొనసాగితే వచ్చే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాగలుగుతుందా.. అసలు ఇంతటి జాప్యం ఎందుకు జరుగుతోంది.. ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్లో వినిపిస్తున్నాయి.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్.. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. కేడర్ కోసం కల్పించాల్సిన అవకాశాల మీద భేటీ నిర్వహించారు. ఎప్పటి మాదిరిగానే భారీ జెండాను తెర ముందుకు తీసుకొచ్చారు. పార్టీ కమిటీ లో నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్ ల పదవులకు గడువులు ముగియడంతో.. రెన్యువల్ చేయాలని అనుకున్నారు.. ఖాళీ అయ్యే గవర్నర్ కోట ఎమ్మెల్సీలను భర్తీ చేయాలని భావించారు.. సీఎం చాలా విస్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో.. ఇవన్నీ కూడా అమలు అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ, ఇవి చర్చలకే పరిమితమవుతాయని.. ఏదో అప్పటికప్పుడు సమావేశాలలో నిర్ణయాలు తీసుకుంటారని.. త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటిస్తారని.. ఆ తర్వాత అడుగు కూడా ముందుకు వేయాలని కార్యకర్తలు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ పదవుల భర్తీ వ్యవహారం ఇప్పటికీ పూర్తికాలేదు. ఇది ఎప్పటికీ పూర్తికాని ఒక సమస్య లాగా మిగిలిపోయింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం అనేకసార్లు కమిటీలను నిర్ణయించారు అనేక పర్యాయాలు అంతర్గత చర్చ జరిపారు. అధిష్టానం వద్దకు జాబితాలు పంపించారు. అవన్నీ కూడా పంపించినంత వేగంతో వెనక్కి వచ్చేశాయి. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు చాలామంది కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నారు. డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. పోలీస్ దెబ్బలు కూడా తిన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని వారు భావించారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఉపశమనం కార్యకర్తలకు లభించలేదు. ఒకవేళ కొంతమందికి పదవులు ఇస్తే.. మిగతావారు పార్టీకి దూరమవుతారని.. అసంతృప్తిని రాజేస్తారని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంతకాలం వేచి చూస్తూ ఉందని సమాచారం.
సంస్థ గత నియామకాలు మాత్రమే కాదు వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా భావిస్తున్నారు. కానీ పార్టీలో కిందిస్థాయి నాయకులలో ఆ స్థాయిలో కదలిక ఏమాత్రం కనిపించడం లేదు. పట్టభద్రులలో ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. ప్రత్యర్ధులు రచిస్తున్న వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కునే స్థాయి పార్టీకి ఉన్నట్టు కనిపించడం లేదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ సీట్ల భర్తీ కోసం ఇప్పటికే చాలామంది నాయకులు ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారు. ఆశావహులు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇన్ని రకాల పరిణామాలు జరుగుతున్నప్పటికీ ఒక్క స్థానం విషయంలో కూడా అధిష్టానం ఏకాభిప్రాయాన్ని ప్రదర్శించలేకపోతోంది..
వాస్తవానికి ఒక నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా మంతనాలు జరుగుతాయి. సీఎం చేతిలో అధికారం ఉండదు. పీసీసీ అధ్యక్షుడు నిర్ణయాన్ని తీసుకోలేడు. మంత్రులు చెప్పినప్పటికీ మాట చెల్లుబాటు కాదు. మిగతా ప్రజా ప్రతినిధుల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. ప్రతి దానికి అధిష్టానం మాత్రమే ఆమోదముద్ర వేయాలి.. దీనికి తోడు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ.. హై కమాండ్ ఇలా రకరకాల షరతులు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అందువల్లే ఏది త్వరగా అమలు కాదు. ఆచరణలో పడదు. అందువల్లే ఈ సుదీర్ఘ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీని నిలిపివేస్తోంది. అధికారులు ఉన్నప్పటికీ నిర్ణయాధికారం లో దూకుడుతనం లేదు. ప్రతి సమస్యను పరిష్కరించకుండా వదిలేయడం.. కాలయాపన చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. ఇలానే జరిగిపోతే మాత్రం ఈ దసరా కాదు.. వచ్చే దసరాకు కూడా పదవుల భర్తీ కాంగ్రెస్ పార్టీలో పూర్తికాదు.