England vs India : బంతి బంతికి సమీకరణం మారింది. క్షణక్షణం ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఒకానొక దశలో 81/6 వద్ద పీకల్లోతు కష్టాల్లో టీమిండియా కూరుకుపోయింది. ఈదశలో రవీంద్ర జడేజా(61*) హాఫ్ సెంచరీ తో అదరగొట్టడంతో విజయం వైపు టీమిండియా అడుగులు వేస్తున్నట్టు కనిపించింది. ఈ దశలోనే ఇంగ్లాండ్ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. చివరి వరకు పోరాడి విజయం సాధించారు. అయితే చివరి మూడు వికెట్లు మాత్రం తీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. సుందర్ వికెట్ 82 పరుగుల వద్ద పడగా.. భారత స్కోర్ జడేజా జస్ ప్రీత్ బుమ్రా, డి.ఎస్.పి సిరాజ్ సహకారంతో 170 పరుగుల దాకా తీసుకొచ్చాడు.. వాస్తవానికి అప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్న స్టోక్స్, ఆర్చర్, కార్స్ అలసిపోయారు. ఓవర్లకు ఓవర్లు వేసినప్పటికీ సిరాజ్ వికెట్ తీయలేకపోయారు.
రూట్ తో బౌలింగ్ వేయించినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ షోయబ్ బషీర్ ను రంగంలోకి దింపాడు. దీంతో అతడు నాలుగో ఓవర్ లో ఫలితాన్ని ఇంగ్లాండ్ జట్టుకు అందించాడు. అతడు వేసిన బంతిని డిఫెన్స్ ఆడేందుకు సిరాజ్ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి పొరపాటున వికెట్లను తగిలింది. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు రెండు విజయాలతో ముందంజలో ఉంది.
హోరాహోరిగా సాగిన ఈ టెస్ట్ క్రికెట్ అభిమానులకు సరికొత్త ఆనందాన్ని అందించింది. టి20, వన్డేలకు అలవాటు పడిన ప్రేక్షకులకు టెస్ట్ క్రికెట్ మజా ఎలా ఉంటుందో చూపించింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో రూట్ సెంచరీ చేశాడు. భారత్ కూడా తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ శతకంతో అదరగొట్టాడు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 192 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత భారత్ ఆ లక్ష్యాన్ని చేదించడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. 170 పరుగులకు ఆల్ అవుట్ అయింది. టీమిండియాలో రాహుల్ 39, రవీంద్ర జడేజా 61* టాప్ స్కోరర్లు గా నిలిచారు.
ఇంగ్లాండ్ విధించిన 192 రన్స్ టార్గెట్ ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. నాలుగు రోజు రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఐదవ రోజైన సోమవారం ఏదైనా జరగవచ్చు అని అందరూ అనుకున్నారు. వారు అనుకున్నట్టుగానే సోమవారం మొత్తం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 58 పరుగుల వద్ద ఐదవ రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా మరో 13 పరుగులు జోడించి రిషబ్ పంత్ వికెట్ కోల్పోయింది. ఇక అప్పట్నుంచి ఆటగాళ్ల వైఫల్యం నిరాటంకంగా కొనసాగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వాషింగ్టన్ సుందర్ (0), జట్టు భారాన్ని మోస్తాడు అనుకున్న కేఎల్ రాహుల్, అదరగొడతాడనుకున్న నితీష్ కుమార్ రెడ్డి (13) విఫలమయ్యారు. ఈ దశలో వచ్చిన బుమ్రా(5), సిరాజ్ (4) సింగిల్ డిజిట్ స్కోర్ లే చేసినప్పటికీ జడేజాకు అండగా ఉన్నారు. బుమ్రా ఏకంగా 54 బంతులు ఎదుర్కొన్నాడు. సిరాజ్ కూడా దాదాపు 30 బంతులు ఎదుర్కొన్నాడు. ఒకవేళ సిరాజ్ కనక అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే.. మరింత ఆత్మ రక్షణ ధోరణిలో ఆడి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది.
వాస్తవానికి ఐదవ రోజు నాలుగు వికెట్లను వెంటవెంటనే తీసిన ఇంగ్లాండ్ బౌలర్లు.. సిరాజ్, బుమ్రా విషయానికి వచ్చేసరికి చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ ఇండియా వైపు కాసేపు మొగ్గింది. ఇదే దశలో బుమ్రా అవుట్ కావడం మ్యాచ్ స్వరూపాన్ని మరో తీరుగా మార్చింది. ఈలోగా జడేజా హాఫ్ సెంచరీ చేశాడు. అతనికి సిరాజ్ అండగా ఉండడంతో భారత్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బషీర్ మాయాజాలం ప్రదర్శించడంతో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాని చివర్లో మాత్రం టీమిండియా ఊహించని స్థాయిలో ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చింది. మ్యాచ్ మొత్తానికి అది హైలెట్ అని చెప్పుకోవచ్చు.