Telangana Ads : ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. ఆ విమర్శలకు అధికార ప్రభుత్వం కౌంటర్ ఇవ్వాలి.. ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాన్ని కార్నర్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిపక్షం అనవసరంగా మాట్లాడుతోంది అనే సంకేతాలను ప్రజల్లో కలిగించాలి. అప్పుడే ఆ ప్రభుత్వం విజయవంతమైనట్టు లెక్క. ఎందుకంటే ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తే అధికారపక్షం డిఫెన్స్ లో పడుతుంది. ప్రతిపక్షానికి ఎటువంటి పరిమితులు ఉండవు కాబట్టి ఇదే కోణాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ఇటువంటి పరిణామం అధికార పార్టీకి ఎన్నికల్లో ఘోరమైన షాక్ ఇస్తుంది. భారతదేశ రాజకీయాలలో ఇప్పటివరకు అధికారాన్ని కోల్పోయిన ప్రతి పార్టీ కూడా ఇలాంటి అనుభవాన్నే చవి చూసింది. ఇప్పుడు ఇదే అనుభవం తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ఎదురవుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ మీద చంద్రబాబు నాయుడు శిష్యుడు అని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి ఆరోపణలు చేస్తోంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్టే వింటున్నారని.. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారని మండిపడుతోంది. ఇటీవల బనకచర్ల ఎత్తిపోతల పథకం విషయంలో భారత రాష్ట్ర సమితి ఎంత హంగామా చేయాలో అంత హంగామా చేసింది. తమ సొంత పార్టీ కార్యాలయంలో హరీష్ రావు, కేటీఆర్ ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.. తప్పు మొత్తం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని.. చంద్రబాబు ఎదుట మోకరిల్లిందని మండిపడ్డారు. కానీ అదే కేంద్ర ప్రభుత్వం బనకచర్ల విషయంలో ఒక్కసారిగా చంద్రబాబుకు హ్యాండ్ ఇవ్వడంతో భారత రాష్ట్ర సమితి పొలిటికల్ టర్న్ మార్చుకుంది. ఇదంతా కూడా తమ ఘనత అని డప్పు కొట్టుకుంది.. ఆ పార్టీ అధికారం పోయిన తర్వాత మస్తు ప్రజాస్వామ్యాన్ని ఒంటపట్టించుకుంది. అంతేకాదు ఆ పార్టీకి ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే గుర్తుకొస్తున్నాయి. తెలంగాణ ప్రజల సమస్యలు మాత్రమే కళ్ళకు కనిపిస్తున్నాయి. ఇదంతా అధికారం దక్కించుకోవడానికి ఆ పార్టీ ఆడుతున్న కాపటనాటకం. ఈ మాట అనడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అతిశయం అంతకన్నా లేదు.
భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలను డిపెండ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విఫలమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ అత్యంత విఫల ప్రదర్శన చేస్తోంది. భారత రాష్ట్ర సమితి చేస్తున్న విష ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విఫలమైనదనే చెప్పుకోవాలి. సోషల్ మీడియా విభాగం సంగతి అటుంచితే.. ప్రభుత్వ ముఖ్యులు మాత్రం ఏం చేస్తున్నట్టు.. వారు కూడా భారత రాష్ట్ర సమితి ఆరోపణలు చేస్తున్నట్టుగానే నడుచుకుంటున్నారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రేషన్ కార్డుల పంపిణీకి నల్గొండ జిల్లా వెళ్లారు. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు కాబట్టి.. ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి కాస్త ఘనంగానే జరిపారు. దానికంటే ముందు గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇక్కడ కూడా భారత రాష్ట్ర సమితికి అనవసరంగా అవకాశం ఇచ్చారు. విమర్శించే ఛాయిస్ తానే కల్పించారు. ఎందుకంటే చంద్రబాబు పత్రికలుగా ఉన్న వాటికి తెలంగాణ ముఖ్యమంత్రి యాడ్స్ ఇచ్చాడు. ఇచ్చేది సమాచార పౌర సంబంధాల శాఖ అయినప్పటికీ.. అంతిమంగా పేరు వచ్చేది రేవంత్ రెడ్డి కే కదా.. పైగా ఆ రెండు పత్రికల మినహా మిగతా వేటికి కూడా ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వలేదు. రేవంత్ మంత్రివర్గంలో ఉన్న ఓ వ్యక్తికి చెందిన పత్రికకు.. మిగతా పత్రికలకు కూడా యాడ్స్ ఇవ్వలేదు. ఇంగ్లీషులో టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో మాత్రమే యాడ్ కనిపించింది. ఇలా తెలిసో తెలియకో తప్పులు చేసుకుంటూ వెళ్తే వాటిని భారత రాష్ట్ర సమితి ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో దానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇదిగో ఇలా తప్పులు చేస్తూ దొరికిపోతుంది. పాపం అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఇబ్బందులో..