Homeక్రీడలుక్రికెట్‌IPL 2027 Auction : ముంబయి నుంచి హైదరాబాద్‌ వరకు కొత్త నాయకుల కోసం అన్వేషణ

IPL 2027 Auction : ముంబయి నుంచి హైదరాబాద్‌ వరకు కొత్త నాయకుల కోసం అన్వేషణ

IPL 2027 Auction : ఐపీఎల్‌ అంటేనే కోట్ల రూపాయల ఆటగాళ్ల కొనుగోళ్లు, అనూహ్యమైన ట్రేడింగ్‌లు, ఉత్కంఠభరితమైన పోటీలు. కానీ ఈసారి మినీ వేలానికి ముందే మరో అంశం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అదే కెప్టెన్సీ! ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం, కొందరిని వదులుకోవడం, మరికొందరిని ట్రేడింగ్ ద్వారా తీసుకురావడంతో పలు ఫ్రాంచైజీల్లో నాయకత్వ సమీకరణాలు మారిపోయాయి. దీంతో వచ్చే సీజన్‌లో జట్లను నడిపించే నాయకులెవరనే చర్చ మొదలైంది. డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్‌-2027 మినీ వేలం […]

IPL 2027 Auction : ఐపీఎల్‌ అంటేనే కోట్ల రూపాయల ఆటగాళ్ల కొనుగోళ్లు, అనూహ్యమైన ట్రేడింగ్‌లు, ఉత్కంఠభరితమైన పోటీలు. కానీ ఈసారి మినీ వేలానికి ముందే మరో అంశం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అదే కెప్టెన్సీ! ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం, కొందరిని వదులుకోవడం, మరికొందరిని ట్రేడింగ్ ద్వారా తీసుకురావడంతో పలు ఫ్రాంచైజీల్లో నాయకత్వ సమీకరణాలు మారిపోయాయి. దీంతో వచ్చే సీజన్‌లో జట్లను నడిపించే నాయకులెవరనే చర్చ మొదలైంది.

డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్‌-2027 మినీ వేలం జరగనుంది. మొత్తం 66 స్లాట్లు అందుబాటులో ఉండగా, పది ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ.297.95 కోట్ల పర్స్ మనీ ఉంది. ఇప్పటికే 55 మంది విదేశీ ఆటగాళ్లతో కలిపి 184 మందిని జట్లు రిటైన్ చేసుకున్నాయి. ఇక వేలంలో ఎవరిని కొనుగోలు చేస్తారన్న దానితో పాటు, మైదానంలో జట్టును ముందుండి నడిపించే బాధ్యత ఎవరికి దక్కుతుందన్నది కీలకంగా మారింది.

ముంబయిలో మళ్లీ రోహిత్ శకం వస్తుందా?

ఐదు టైటిళ్లతో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న ముంబయి ఇండియన్స్‌కు గత కొన్ని సీజన్లు ఆశించిన స్థాయిలో సాగలేదు. హార్దిక్ పాండ్య కెప్టెన్సీలోనూ జట్టు పాత వైభవాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీపై మరోసారి చర్చ మొదలైంది.

జట్టులో బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు నాయకత్వ లక్షణాలు కలిగినవారే. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు తిరిగి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే యువ ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం కల్పించవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ముంబయి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

రింకూ సింగ్‌కు ప్రమోషన్ తప్పదా?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌లోనూ నాయకత్వ మార్పు చర్చనీయాంశంగా మారింది. రహానే వీడ్కోలుతో కెప్టెన్సీ స్థానంపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో రింకూ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అతడికి కలిసిరానుంది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడగలగడం కూడా రింకూకు అదనపు బలం. దీంతో కేకేఆర్ కొత్త నాయకుడిగా అతడిని ఎంపిక చేసే అవకాశాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లఖ్‌నవూలో మార్‌క్రమ్‌కు లక్కు కలిసొస్తుందా?

రిషభ్ పంత్ జట్టును వీడటంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూరన్, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లు నాయకత్వ రేసులో ఉన్నప్పటికీ ఐదెన్ మార్‌క్రమ్ పేరు బలంగా వినిపిస్తోంది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. అందువల్ల జట్టు యాజమాన్యం మార్‌క్రమ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.

ఢిల్లీలో ముగ్గురి మధ్య పోటీ!

రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రావడంతో అక్కడ కెప్టెన్సీ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో జట్టును నడిపించిన అక్షర్ పటేల్ తన స్థానాన్ని కొనసాగించాలని భావిస్తుండగా, పంత్ రాకతో సమీకరణాలు మారాయి. మరోవైపు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా నాయకత్వ బాధ్యతలపై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఢిల్లీ అభిమానులకు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

కమిన్స్ లేకుంటే ఇషాన్‌కే పగ్గాలా?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్ రూపంలో బలమైన నాయకుడు ఉన్నాడు. అతడి కెప్టెన్సీలో జట్టు దూకుడైన క్రికెట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే వచ్చే సీజన్‌లో కమిన్స్ అందుబాటుపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అతడు జట్టుకు అందుబాటులో లేకపోతే ఇషాన్ కిషన్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. గత సీజన్‌లో కొంతకాలం జట్టుకు సారథ్యం వహించిన అనుభవం అతడికి ఉంది. అభిషేక్ శర్మ కూడా ప్రత్యామ్నాయంగా ఉండవచ్చు. అయితే కమిన్స్ అందుబాటులో ఉంటే కెప్టెన్సీ మార్పు అవసరం లేకపోవచ్చు.

వేలంలో ఆటగాళ్లే కాదు.. నాయకుల భవిష్యత్తుపైనా నిర్ణయం!

ఐపీఎల్ మినీ వేలం అంటే సాధారణంగా బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల కొనుగోళ్లే ప్రధాన ఆకర్షణ. కానీ ఈసారి పలు జట్లలో కెప్టెన్సీ మార్పుల చర్చ కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు కొత్త ఆటగాళ్లతో జట్టును బలోపేతం చేసుకోవడం, మరోవైపు సరైన నాయకుడిని ఎంపిక చేసుకోవడం ఫ్రాంచైజీలకు సవాలుగా మారింది.

ముంబయి రోహిత్ వైపు మొగ్గు చూపుతుందా? కేకేఆర్ రింకూకు బాధ్యతలు అప్పగిస్తుందా? ఢిల్లీ పంత్‌కు మరోసారి అవకాశం ఇస్తుందా? సన్‌రైజర్స్ కమిన్స్‌పైనే నమ్మకం ఉంచుతుందా? ఈ ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానాలు దొరకనున్నాయి. డిసెంబర్ 16 వేలం ఆటగాళ్ల భవిష్యత్తుతో పాటు కొన్ని జట్ల నాయకత్వ దిశను కూడా నిర్ణయించే కీలక వేదికగా మారనుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper