India vs England Test 2025 : “బుమ్రా లేడు. సిరాజ్ వికెట్లు తీయడం లేదు.. ఆకాష్ దీప్ కు అనుభవం లేదు. రవీంద్ర జడేజా బౌలింగ్ లో లయ లేదు.. మిగతా బౌలర్లలో సత్తా లేదు. ఇలాంటి చోట మ్యాచ్ ఎలా గెలుస్తారు? బలమైన ఇంగ్లాండ్ జట్టును ఎలా నిలువరిస్తారు? తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లను అవుట్ చేయలేక చేతులెత్తేశారు కదా.. ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ కూడా పోయినట్టే” ఇవీ రెండు టెస్ట్ ప్రారంభానికి ముందు మీడియాలో వినిపించిన వ్యాఖ్యలు. మాజీ ఆటగాళ్లు చేసిన విమర్శలు. వీటన్నిటిని టీమిండియా యువ ఆటగాళ్లు మనసులో పెట్టుకున్నారు. విమర్శించే వారికి.. ఆరోపించేవారికి నోటితో కాకుండా ఆటతో సమాధానం చెప్పాలని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆటతోనే సమాధానం చెప్పారు.
ఈ సిరీస్ లో తొలి టెస్ట్ లో భారత జట్టు సారధి సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో తేలిపోయాడు. కానీ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ గిల్ 269 పరుగులు చేశాడు. అంతేకాదు రవీంద్ర జడేజాతో తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది ఒక రకంగా మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ లాగా నిలిచింది. రవీంద్ర జడేజా కూడా తన వంతుగా 89 పరుగులు చేశాడు. ఇది కూడా మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఏకంగా 578 రన్స్ చేసింది. దీనిద్వారా ఇంగ్లాండ్ జట్టుకు భారత్ మొదటి హెచ్చరికను పంపింది.
మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన తర్వాత దానిని కాపాడుకోవడానికి భారత జట్టు తీవ్రంగా ప్రయత్నించింది. ముఖ్యంగా సిరాజ్ ఆరు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టుకు 180 పరుగుల లీడ్ లభించింది. ఒకానొక దశలో బ్రూక్, స్మిత్ అదరగొట్టినప్పటికీ.. కీలక దశలో బ్రూక్ ను ఆకాష్ అవుట్ చేశాడు. తద్వారా భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇక తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ తో పాటుగా ఆకాశ్ అదరగొట్టాడు. అతడు ఏకంగా నాలుగు వికెట్లు సాధించాడు.
రెండవ ఇన్నింగ్స్ లో భారత జట్టు మరింత బీభత్సంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 161 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక మిగతా బ్యాటర్లు రవీంద్ర జడేజా , పంత్ , రాహుల్ అత్యంత కీలకమైన రన్స్ చేసి తమ వంతు పాత్ర పోషించారు. బ్యాటర్లందరూ కలసికట్టుగా ఆడటంతో టీమ్ ఇండియా ఇంగ్లాండ్ జట్టు ఎదుట 607 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇంతటి భారీ స్కోర్ తో ఇంగ్లాండ్ జట్టుకు రెండవ ప్రమాద హెచ్చరికను భారత్ పంపించింది.
607 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో ఇంగ్లాండ్ జట్టు తడబడింది. ముఖ్యంగా స్మిత్ 88 పరుగులు చేసి అదరగొట్టాడు. అయితే అంతకంటే ముందు టీమ్ ఇండియా బౌలర్ ఆకాష్ 6 వికెట్ల ప్రదర్శనతో దుమ్మురేపాడు. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మొత్తాన్ని కకావికలం చేశాడు. అత్యంత పదునైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన టెస్ట్ క్రికెట్ కెరియర్లో తొలిసారిగా ఐదు వికెట్ల ఘనతను సాధించాడు.. కట్టుదిట్టమైన లైన్ లెంగ్త్ పాటిస్తూ అద్భుతంగా బంతులు వేశాడు. అతడి దూకుడుకు ఇంగ్లాండు బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో భారత్ విజయం ఖాయమైంది.
తొలి టెస్ట్ లో భారీగా పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ విఫలమైంది. అయితే ఇంగ్లాండ్ జట్టుకు ఆ డోస్ సరిపోదని భావించిన భారత జట్టు ఈసారి భారీ టార్గెట్ విధించింది. ఆ టార్గెట్ ను కాపాడుకుంటూనే.. వెంట వెంటనే వికెట్లు తీసింది. అందువల్లే విజయం సాధ్యమైంది. గిల్ సెంచరీల మోత, ఆకాష్, సిరాజ్ వికెట్ల వేట మొత్తానికి భారత జట్టుకు విజయాన్ని అందించాయి. అంతేకాదు విజయమంటూ తెలియని ఎడ్జ్ బాస్టన్ వేదికపై గెలుపును దక్కించుకునేలా చేశాయి.