Team India : యువకులతో కూడిన టీమిండియా ఇంగ్లీష్ గడ్డ మీద అద్భుతం చేసింది. రోహిత్ లేకపోయినప్పటికీ.. విరాట్ అండ లేకపోయినప్పటికీ.. బుమ్రా రిజర్వ్ బెంచ్ కు పరిమితమైనప్పటికీ.. టీమిండియా అదరగొట్టింది. యువకులతో కూడిన జట్టు ఇంగ్లీష్ గడ్డ మీద సంచలనం సృష్టించింది. బలమైన లైనప్ ఉన్న ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించింది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తద్వారా ఈ సిరీస్ ను 1-1 సమం చేసింది.
ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 578 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ 269 పరుగులు చేశాడు. జై స్వాల్ 87, రవీంద్ర జడేజా 89 పరుగులు చేశారు. బషీర్ 3, టంగ్, వోక్స్ చెరి రెండు వికెట్లు సాధించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 407 పరుగులకు ఆలౌట్ అయింది. స్మిత్ 184, బ్రూక్ 158 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ ఆరు వికెట్లు, ఆకాశ్ దీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్ 180 పరుగుల లీడ్ తో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ 161, రవీంద్ర జడేజా 69, రిషబ్ పంత్ 65, కేఎల్ రాహుల్ 55 పరుగులు చేశారు. టంగ్, బషీర్ చెరి రెండు వికెట్లు సాధించారు. మొత్తంగా 607 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు ముందు భారత్ ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించడంలో ఇంగ్లాండ్ మొదటి నుంచే తడబడింది. ఆకాష్ (ఐదు వికెట్లు) ధాటికి ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్ వంటి ఆటగాళ్లను ఆకాష్ అవుట్ చేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టయింది. చివర్లో ఇంగ్లాండ్ జట్టుకు చెందిన టెయిలండర్లు కాస్త ప్రతిఘటించినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది..
ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఆదివారం ఉదయం వర్షం కురవడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఒకానొక దశలో వర్షం తీవ్రంగా కురవడంతో మ్యాచ్ జరిగేది అనుమానంగానే ఉంది. వర్షం తగ్గడం..అవుట్ ఫీల్డ్ ఆరిపోవడంతో మ్యాచ్ నిర్వహించారు. అయినప్పటికీ భారత బౌలర్లు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ప్రతి సందర్భంలోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. నాలుగు రోజు ఇంగ్లాండు రెండవ ఇన్నింగ్స్ లో కీలకమైన వికెట్లు పడగొట్టి సత్తా చాటిన ఆకాష్.. ఐదవ రోజు కూడా అదే జోరు చూపించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో బుమ్రా లేకపోవడంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. మ్యాచ్ గెలిచే అవకాశం ఉండదని అంచనాకొచ్చారు. కానీ వారందరి అంచనాలను టీమిండియా ఆటగాళ్లు తలకిందులు చేశారు. యువకులతో కూడిన జట్టతో అద్భుతం చేశారు.. ఎడ్జ్ బాస్టన్ వేదికలో ఇంతవరకు టీం మీడియా విజయం సాధించలేదు. అయితే గిల్ ఆధ్వర్యంలోని యువ ఆటగాళ్ల బృందం ఆ అపప్రదను చెరిపేసుకుంది. తొలిసారిగా ఈ మైదానంపై విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.