KTR Khammam tour: రాజకీయాలలో ఇలా ఉండాలని ఉండదు. ఇలా ఉంటేనే బాగుంటుందని కూడా ఉండదు. రాజకీయాలలో ఎలాగైనా జరుగుతుంది. ఏదైనా జరుగుతుంది. దానికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. కొన్ని సందర్భాలలో బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి కలిసిపోతాయి. రాజకీయ లక్ష్యాల కోసం కలిసి పోటీ చేస్తాయి. ఇంతవరకు జాతీయస్థాయి రాజకీయ మొక్క చిత్రంలో ఇటువంటి సన్నివేశం చూడకపోయినప్పటికీ.. రాష్ట్ర స్థాయిలలో మాత్రం కాంగ్రెస్, బిజెపి ఒక ఒర లో ఇమిడిపోయిన దృశ్యాలు చాలానే కనిపించాయి.
తెలంగాణలో ఇప్పుడు విభిన్నమైన రాజకీయ దృశ్యం కనిపిస్తోంది. బహుశా దీనిని చాలామంది ఊహించి ఉండరు. 2014లో, 2018 లో భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ ఏపీ రాజకీయాలలో వేలు పెట్టడం మొదలుపెట్టారు.
అంతకుముందు చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి రిటర్న్ గిఫ్ట్ లో భాగంగా కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేశారు. 2019లో ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో విజయవంతం అయ్యారు.. చాలా సందర్భాలలో అలైబలై అన్నట్టుగా వ్యవహరించారు. మధ్య మధ్యలో ప్రగతి భవన్ కు పిలిపించడం.. తెలంగాణ సత్కారాలు అందించడం వంటివి జరిగిపోయాయి. 2023 ఎన్నికల్లో మాత్రం సెంటిమెంట్ రగిలించే క్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీదికి ఏపీ పోలీసులు వచ్చారు. అప్పట్లో ఈ సన్నివేశం కాస్త ఉద్విగ్నంగా మారినప్పటికీ.. గులాబీ పార్టీకి మాత్రం ఓట్లు తెప్పించే మంత్రంగా పనిచేయలేదు.
ఇప్పుడిక అటు తెలంగాణలో.. ఇటు ఆంధ్రప్రదేశ్లో కెసిఆర్, జగన్ అధికారాన్ని కోల్పోయారు. అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలికృతం అవుతాయి తెలియదు కానీ.. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీకి వైసిపి బహిరంగంగా సపోర్ట్ తెలియజేస్తోంది. బుధవారం ఖమ్మంలో కేటీఆర్ పర్యటించినప్పుడు.. కూసుమంచి వద్ద స్వాగతం పలికే క్రమంలో గులాబీ పార్టీ జెండాలతో పాటు, వైసిపి జెండాలు కూడా కనిపించాయి. కొంతమంది జగన్, కేటీఆర్ ను కలిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలంగాణ వాదంతో, తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి.. తెలుగుదేశం పార్టీని, వైసీపీని, జనసేన ను ఆంధ్ర బూచిలుగా చూపించే ప్రయత్నం చేసింది. చివరికి ఆ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ 2018లో అధికారంలోకి వచ్చింది. ఇక ఉద్యమ సమయంలో అయితే జగన్ మీద కేసీఆర్, కేటీఆర్ ఏ స్థాయిలో విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మానుకోటలో జగన్ పర్యటన సందర్భంగా రాళ్లు రువ్విన సంఘటన కూడా విధితమే. ఇన్ని జరిగిన తర్వాత కేవలం రాజకీయ ఆకాంక్షలతోనే గులాబీ పార్టీ అడుగులు వేయడం.. తన ఉద్యమస్మృతిని మర్చిపోవడం బాధాకరం. తన పర్యటనలో వైసీపీ జెండాలు కనిపించడం ద్వారా తెలంగాణ సమాజానికి కేటీఆర్ ఏం సమాధానం చెబుతారు? ఎలాంటి సంజాయిషీ ఇస్తారు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
ఇటీవల బెంగళూరు నగరంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో జగన్, కేటీఆర్ పాల్గొన్నారు. వారిద్దరూ పక్కపక్కన కూర్చున్నారు.. ఈ కలయికను గులాబీ పార్టీ గొప్పగా చెప్పుకుంది. వైసిపి గట్టిగా ప్రచారం చేసుకుంది. దీనిని బట్టి అంతర్గతంగా ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ వాదులు అంటున్నారు.