Telangana activists : తొలి, మలి దశల్లో జరిగిన తెలంగాణ ఉద్యమం ఆనిర్వచనీయం. సకల జనుల సమ్మె నుంచి ధూమ్ ధాం దాకా… సహాయ నిరాకరణ నుంచి యువకుల బలిదానాల దాకా తెలంగాణ ఉద్యమం అనన్య సామాన్యం. అలాంటి త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ఉద్యమకారులకు దక్కిన గౌరవం ఏ పాటిది అంటే? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాదు ఉద్యమకారులకు పూర్తిస్థాయిలో న్యాయం కూడా జరగలేదంటే అతిశయోక్తి కాక మానదు.
1200 నుంచి 650 దాకా కుదించారు
తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో 1200 మంది అమర వీరులయ్యారని ప్రకటించారు. ఆ మేరకు తీర్మానం కూడా చేశారు. వారందరికీ పరిహారం ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్లు 1200 మంది అమర వీరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి రూ.120 కోట్లవుతుంది. కానీ, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం అమర వీరుల సంఖ్యను భారీగా కుదించింది. కేవలం 650 మందినే గుర్తించింది. వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. వారిలోనూ దాదాపు 580 మందికే పరిహారం ఇచ్చింది. ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన వారిలో మిగిలిన 70 మందికి పరిహారం అందించడానికి దాదాపు రూ.7 కోట్లు ఖర్చవుతుంది. కానీ, తొమ్మిదేళ్లుగా ఆ నిధులను కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వం గుర్తించని మిగిలిన అమర వీరుల గురించి అసలు పట్టించుకోనేలేదు. ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేవలం ప్రకటనల కోసమే ప్రభుత్వం రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. ఉత్సవాలకు మరో రూ.105 కోట్లను కేటాయించింది. కానీ, తాము అధికారంలోకి రావడానికి కారకులైన త్యాగధనుల కుటుంబాలకు కేవలం రూ.60-70 కోట్ల పరిహారం చెల్లించడానికి మాత్రం ధనిక రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయట్లేదు. అంతేనా, పంజాబ్‌లో చనిపోయిన రైతుల కుటుంబాలకు, ఇతర రాష్ట్రాల్లో వీర సైనికుల కుటుంబాలకు ఉదారంగా సాయం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమకెందుకు న్యాయం చేయట్లేదని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసులు మాఫీ కాలేదు
ఉద్యమ సమయంలో కేసులు నమోదైన వారినీ ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో, ఇప్పటికీ కొందరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,442 కేసులను ఎత్తేస్తే.. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు 698 కేసులను ఎత్తేసింది. ఇంకా వెయ్యికిపైగా కేసులతో అప్పటి ఉద్యమకారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉద్యమ పల్లకి మోసిన వారిలో చాలా మంది ఇప్పటికీ కూలీలుగానే మిగిలిపోయారు. వారి త్యాగ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో అదే పల్లకీపై ఊరేగుతూ మరికొందరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎవరైనా ఒక నాయకుడు పిలుపునిస్తే.. ఏదైనా ఒక ప్రకటన తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే.. తెలంగాణవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతరులు ఉద్యమంలోకి దూకేవారు. భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆందోళనల్లో పల ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. కొన్ని సందర్భాల్లో పోలీసులపైకే తిరుగుబాటు చేశారు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులు, నిరుద్యోగుల్లో కొందరు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర సాధన కోసం అప్పట్లో చేసిన పోరాటం కొందరు నిరుద్యోగులకు ఇప్పుడు శాపంగా మారింది. విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకోవాలనుకునే వారి కల కలగానే మిగులుతోంది. ఉద్యమ కేసులను కేసీఆర్ సర్కారు పాక్షికంగా ఎత్తేయడమే ఇందుకు కారణం.
ఏ మాటా నిలబెట్టుకోలేదు
నిజానికి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క కేసు కూడా లేకుండా అన్ని కేసులనూ ఎత్తి వేస్తామని టీఆర్ఎస్ నేతలు పదే పదే హామీ ఇచ్చారు. దాంతో, యువత మరింత ఉత్సాహంగా ఉద్యమంలో పాల్పంచుకుంది. అందుకే, 2009 నుంచి 2014 మధ్య కాలంలో మూడు వేలకుపైగా ఉద్యమ కేసులు నమోదయ్యాయి. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్ని రెండు దఫాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి వేసింది. తొలుత, 984 కేసులను ఎత్తి వేయగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 348 కేసులు ఎత్తివేశారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా కేసులు ఎత్తివేస్తామని తెలంగాణ రాష్ట్ర మొదటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి 698 కేసులు ఎత్తివేస్తున్నట్లు సంతకాలు చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులకు అవకాశం లేకుండా ఒక్కో కేసుకు ప్రభుత్వం ఒక్కో జీవో జారీ చేసింది. తప్పితే, మొత్తం కేసులను ఎత్తివేయలేదు. ఎక్కువ కేసులున్న పోలీస్ స్టేషన్లలో మాత్రమే ఎత్తి వేశారు. ముఖ్యంగా, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులన్నింటినీ పూర్తిగా ఎత్తివేశారు. ఓయూ విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో చేసిన ధర్నాలు, ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కొన్నింటిని ఇప్పటి వరకు ఎత్తి వేయలేదు. కొన్ని కేసుల్లో ప్రభుత్వం అనుకున్న దానికంటే ఒక్క సెక్షన్ వేరుగా ఉన్నా పట్టించుకోలేదు. దాదాపు ఉద్యమ కేసులన్నింటినీ ఎత్తి వేశామని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే రైల్వే కేసులు, ఇతర తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులు కొన్ని మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు గతంలో అధికారులు ప్రకటించారు. కానీ, ఇప్పటికీ చాలామంది యువతకు తమపై నమోదైన కేసుల పరిస్థితి ఏమిటనే దానిపై స్పష్టత లేదు
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: What is the identity of activists in telangana decade celebrations
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com