War of Words: కాంగ్రెస్ అంటేనే కలహాల పార్టీ. ఎవరికి వారే అధిష్టానంలా భావిస్తారు. ఈ కలహాలో తెలంగాణ ఇచ్చినా.. రాష్ట్రంలో పదేళ్లు అధికారానికి దూరం చేశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా పనిచేయడం, బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరగడం హస్తం పార్టీకి అచ్చొచ్చింది. అధికారంలోకి తెచ్చింది. 18 నెలల పాలన తర్వాత ఇప్పుడు మళ్లీ అధికార కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. కొన్ని సర్దుమణగగా, వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలన వ్యాఖ్యలతో అంతర్గత కలహాలను హీటెక్కిస్తున్నారు. సొంత పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులపైనా తీవ్ర విమర్శలు చేస్తూ, రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు.
ఎర్రబెల్లి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ..
కొండా మురళి తన తాజా వ్యాఖ్యల్లో ఎర్రబెల్లి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ‘ఎర్రబెల్లి అన్న పేరుతో పుట్టిన వారంతా ఎర్ర బల్లులే‘ అని వ్యాఖ్యానించడం ద్వారా, బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావులపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. కొండా మురళి తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ, తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో తన భార్య కొండా సురేఖను వరంగల్ తూర్పు నుంచి గెలిపించిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన వాదించారు.
సొంత పార్టీ నేతలపై విమర్శలు
కొండా మురళి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చాయి. ఆయన సొంత పార్టీకి చెంది కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి వంటి నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణ కమిటీ విరణ కోరింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వంటి నాయకులు, కొండా మురళి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశాలు నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కూడా కుట్ర ఆరోపణలు చేస్తూ, కొండా మురళి తన వ్యతిరేకులను ఏకం చేస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల ఖర్చులపై సంచలన వ్యాఖ్యలు..
కొండా మురళి ఎన్నికల ఖర్చులపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. గత ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేసినట్లు, 500 ఎకరాల భూమిలో 16 ఎకరాలు అమ్మినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు ఎవరి ఆర్థిక సహాయం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లాయి. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కొండా మురళి ఎన్నికల ఖర్చులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో కొండా మురళి తీరుతో ఆయన భార్య, రాష్ట్ర మంత్రి సురేఖ పదవికి ఎసరు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచారణ
కొండా మురళి ఎన్నికల ఖర్చులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చాయి. ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని, కొండా సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈసీ విచారణ చేపడితే, కొండా సురేఖ మంత్రి పదవికి, శాసనసభ సభ్యత్వానికి సంకటం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. ఎందుకంటే ఎన్నికల ఖర్చు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిరూపితమైతే తీవ్ర పరిణామాలు ఎదురవచ్చు.