Vallabhaneni Vamsi Released: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. నాలుగున్నర నెలల జైలు జీవితం ముగిసింది. పలు కేసుల్లో 137 రోజులు జైల్లో ఉన్న వంశీకి మంగళవారం(జూలై 1న) బెయిల్ మంజూరైంది. దీంతో జూలై 2న ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. వంశీపై మొత్తం 11 కేసులు నమోదు కాగా, నూజివీడు కోర్టు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ ఇవ్వడంతో అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది.
షాకింగ్ లుక్..
వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత, ఆయన రూపంలో వచ్చిన మార్పు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో ఆకర్షణీయమైన రూపం, చక్కటి డ్రెస్సింగ్‌తో యంగ్‌గా కనిపించే వంశీ.. జైలు జీవితం తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల్లో ఆయన నీరసంగా, బరువు పెరిగినట్లు, వృద్ధాప్య లక్షణాలతో కనిపించారు. 53 ఏళ్ల వంశీ 80 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. జైలులో ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు, వెన్నునొప్పి, ఆయన రూపంపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు.
ఆరోగ్య సమస్యలు
వంశీ జైలులో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. మే నెలలో శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఆయనను విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత తిరిగి జైలుకు తీసుకెళ్లారు. తన ఆరోగ్య సమస్యల గురించి కోర్టులో పలుమార్లు వంశీ కూడా స్వయంగా ప్రస్తావించారు. ఇంటి ఆహారం, మంచం, ఒంటరిగా గదిలో ఉంచకూడదని అభ్యర్థించారు. అయినప్పటికీ, జైలు జీవితం ఆయన శారీరక, మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావం చూపింది.
వంశీపై నమోదైన కేసులు..
ఇదిలా ఉంటే.. వంశీపై గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ, అక్రమ మైనింగ్, భూ కబ్జా వంటి 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒక్కొక్కటిగా బెయిల్ సాధించినప్పటికీ, కొత్త కేసులు నమోదవడంతో ఆయన విడుదల ఆలస్యమైంది. నూజివీడు కోర్టు చివరి కేసులో బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
నెటిజన్ల వ్యాఖ్యలు..
వంశీ జైలు నుంచి విడుదలైన తర్వాత, సోషల్ మీడియాలో ఆయన రూపంపై విమర్శలు, వ్యంగ్య వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వంశీ గ్లామర్ గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. జైలు జీవితం వంశీ గ్లామర్‌ను పూర్తిగా మాయం చేసిందని వ్యాఖ్యానించారు. అయితే, వైసీపీ నాయకులు వంశీ విడుదలను స్వాగతిస్తూ, ఆయనపై కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమని ఆరోపించారు.
జైలు నుండి విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
137 రోజులు జైల్లో ఉన్న వంశీ https://t.co/uISu4fm77m pic.twitter.com/HNA1Oeu8gk
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2025