Lok Sabha Election 2024
Lok Sabha Election 2024: తెలంగాణ ఉద్యమనేత, పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుటుంబం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా ఉంది. పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆయన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.
2004 ఎన్నికల బరిలో కేసీఆర్..
పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్ నుంచి లోక్‌సభ స్థానాలకు పోటీచేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి తన మేనల్లుడు హరీశ్‌రావును పోటీకి దింపి గెలిపించారు. నాడు కేంద్రంలో ఏర్పడిన యూపీఏ సర్కార్‌లో కేసీఆర్ మంత్రిగా పనిచేశారు.
రెండుసార్లు రాజీనామా..
తర్వాత జరిగిన పరిణామాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కేసీఆర్ 2006, 2008లో తన పదవికి రాజీనామా చేసి కరీంనగర్ నుంచి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో హరీశ్‌రావు సిద్దిపేట నుంచి పోటీ చేశారు. కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి పోటీ చేయించారు.
2014 ఎన్నికల్లో..
ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. తర్వాత మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. ఇవే ఎన్నికల్లో హరీశ్‌రావు సిద్దిపేట నుంచి కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేలుగా, కూతురు కవిత నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు.
2019 ఎన్నికల్లో..
ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయకపోయినా.. కవిత మాత్రం నిజామాబాద్ స్థానం నుంచి బరిలో దిగి బీజేపీ నేత అర్వింద్ చేతిలో ఓడిపోయారు. ఇక 2022లో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ప్రతిపక్షానికి బీఆర్‌ఎస్ పరిమితమైంది.
2024 ఎన్నికల్లో పోటీకి దూరం..
ఇక ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు. నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేస్తారని మొదట సంకేతాలు ఇచ్చారు. అయితే కేంద్రం పసుపు బోర్డు ఇవ్వడంతో పోటీ చేయకపోవడమే మేలని భావించి దూరంగా ఉన్నారు. ఇక మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రతిపక్షంలో రేవంత్ ముందు కూర్చోడానికి ఇష్టపడని కేసీఆర్ ఎంపీగా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ, ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతమైతే పరువు పోతుందని భావించిన గులాబీ బాస్.. తన కుటుంబాన్ని 2024 లోక్‌సభ ఎన్నికలకు రూదరంగా ఉంచారని తెలుస్తోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: This is the first time since the birth of the party that the kcr family is away from the election
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com