Telangana: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. దీంతో విజయోత్సవాలను ప్రారంభించింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చడంలో జాప్యం జరగుతూనే ఉంది. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొందరికి రుణమాఫీ, మాత్రమే అమలయ్యాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం లేదు. ఉద్యోగాల భర్తీ హామీ సగం కూడా నెరవేరలేదు. ఇక రేషన్ కార్డులపై జనవరి నుంచి సన్న బియ్యం ఇస్తామన్న హామీ కూడా ఇప్పట్లో నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయాన్ని పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ స్వయంగా ప్రకటించారు. జనవరి నుంచే రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం అందిస్తామని సీఎం రేవంత్, మంత్రులు చెబుతున్నారు. చౌహాన్ మాత్రం అది సాధ్యం కాదంటున్నారు. మరో మూడు నెలల వరకు సన్నబియ్యం పంపిణీ సాధ్యం కాదని పేర్కొంటున్నారు.
సరైనా కారణమే..
సన్న బియ్యం పంపిణీకి డీఎస్. చౌహాన్ చెప్పిన కారణం సహేతుకంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. సన్న వడ్లకు రూ.500 బోనస్‌తో ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే.. ఈ కొనుగోళ్లు జనవరి వరకూ కొనసాగే అవకాశం ఉంది. కొనుగోళ్లు చేసిన వడ్లను మూడు నెలల వరకు మిల్లింగ్ చేసే అవకాశం ఉండదు. ధాన్యం బాగా ఆరిన తర్వాత మిల్లింగ్ చేస్తేనే నిర్దేశించిన మేరకు బియ్యం వస్తాయి. దీంతో సన్నబియ్యం పంపిణీ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. రేషన్‌కార్డుతోపాటు పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఉచిత బియ్యం సరఫరా అలస్యం కానుంది.
మూడు నెలల తర్వాత..
సంక్రాంతికి తెల్ల రేషన్‌కార్డుపై పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ధాన్యం కొనుగోళ్లు ప్తూయిన మూడు నెలల తర్వాత మిల్లింగ్ మొదలవుతుంది. అంటే మార్చిలో మిల్లింగ్ ప్రారంభిస్తారు. మిల్లింగ్ ప్రారంభించిన తర్వాత తెలంగాణలో ఉన్న 90 లక్షల రేషన్‌కార్డుపై ఉన్న కుటుంబ సభ్యులు వివరాలకు సరపడా బియ్యం సేకరణ జరగాలి. ఆ తర్వాతనే పంపిణీ ప్రారంభించే అవకాశం ఉంది. అంటే ఇంగ్లిష్ కొత్త సంవత్సరం నుంచి కాకుండా తెలుగు కొత్త సంవత్సరం ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభిచే అవకాశం ఉంది.