Mahbubnagar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే.. కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సభ నిర్వహించింది. ఈ సభ వేదికగా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ, వరికి రూ.500 బోనస్, రైతుబంధు ఏడాదికి రూ.12 వేల చెల్లింపు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి.. వివిధ హామీలు కూడా ఇచ్చారు. అప్పటికే పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై విసిగిపోయి ఉన్న రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపించింది. దీంతో ఎన్నికల్లో ఆ పార్టీకి మెజారిటీ సీట్లు కట్టబెట్టారు. దీంతో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్ ప్రమాణం చేశారు. ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలలకే హామీల అమలుపై విపక్ష బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలు పెట్టారు. అయితే అధికారం చేపట్టిన రెండు రోజులకే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం మిగతా హామీల అమలులో జాప్యం చేసింది. విపక్షాల ఒత్తిడితో రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా అమలు చేశారు. ఇక కీలకమైన రైతు రుణమాఫీ మాత్రం ప్రారంభించలేదు. ఇంతలో లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. కోడ్ అమలులోకి రావడం, లోక్‌సభ ఎన్నిక ప్రచారం ప్రారంభించడంతో విపక్ష బీఆర్‌ఎస్, అధికార కాంగ్రెస్ నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు రుణమాఫీ చేయడం అసంభవం అని ప్రకటించారు. రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించిన రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ప్రతీ ఎన్నికల సభలో దీనిని ప్రమాణం చేసి మరీ చెప్పారు. చెప్పినుట్లగానే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రుణమాఫీపై కసరత్తు చేశారు. నిధులు సమీకరించుకుని జూలై 18 నుంచి రుణమాఫీ ప్రారంభించారు.
మూడు విడతల్లో రుణాలు మాఫీ..
రైతుల పంట రుణాలు మూడు విడతల్లో మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో రూ.1 లక్ష లోపు రుణాలు జూలై 18న మాఫీ చేశారు. ఈమేరకు రూ.6 వేల కోట్ల పైచిలుకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల పైచిలుకు మంది లబ్ధి పొందారు. ఇక రెండో విడతగా జూలై 30న రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేశారు. ఇందు కోసం రూ.12 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇక ఆగస్టు 15 లోపు మూడో విడతగా రూ.2 లక్షలోపు రుణాలు మాఫీ చేయనున్నారు. ఇదిలా ఉంటే. మొదటి రెండు విడతల్లో చాలా మంది అర్హత ఉన్న రైతుల రుణాలు మాఫీ కాలేదు. దీంతో ఆందోళన చెందుతున్నారు.
కన్నీరు పెట్టిన పాలమూరు రైతు..
పాలమూరు(మహబూబ్‌నగర్) జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన వడ్డే మల్కమ్మ, వడ్డె చంద్రయ్య దంపతులు తమకు రుణమాఫీ కాలేదని కన్నీటిపర్యంతమయ్యారు. తమ రుణం మాఫీ కాలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు ఆటోలో మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు సోమవారం(ఆగస్టు 5న) తన చిన్న కుమార్తె భారతమ్మతో వచ్చారు. కలెక్టర్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ‘నిరుపేదలం బిడ్డా..! పంటలు పండక దిగుబడి రాక.. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాం.. నా కొడుకు అప్పులు చెల్లించే పరిస్థితులు లేక ఉరేసుకొని కాలమయిండు. సర్కారు రుణమాఫీ చేస్తున్నామంటే ఎంతో ఆశగా బ్యాంకు కాడికి పోతే రుణమాఫీ కాలేదంటున్నరు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
రూ.70 వేల అప్పు..
హన్వాడ మండలం గుండ్యాల శివారులో తన భార్య మల్కమ్మ పేరుపై ఎకరంన్నర పొలం, తన పేరుపై నాలుగు ఎకరాల భూమి ఉన్నదని చంద్రయ్య తెలిపాడు. ఈ భూమిపై బ్యాంక్‌లో ఒకసారి రూ.30 వేలు, మరోసారి రూ.40 వేల రుణం తీసుకున్నమని చెప్పాడు. మొత్తం రూ.70 వేల అప్పు ఉన్నదని, రుణమాఫీ కోసం బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పూటగడవని పరిస్థితులు ఉన్నాయని, కలెక్టర్, అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
రుణమాఫీ అవ్వదని చెప్పిన బ్యాంక్ అధికారులు.. కన్నీళ్లు పెట్టుకున్న రైతన్న
మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చంద్రాస్‌పల్లి గ్రామానికి చెందిన వడ్డే మల్కమ్మ, వడ్డె చంద్రయ్య అనే దంపతులు రుణమాఫీ అవ్వలేదని బ్యాంక్ దగ్గరికి వెళ్లారు.. వారి ఖాతా చెక్ చేసిన అధికారులు రుణమాఫీకి అర్హులు… pic.twitter.com/gJ7OI4tT2y
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2024