https://oktelugu.com/

MLA Manohar Reddy Birthday: ఎంకన్నా… గిది పద్ధతేనా.. ఎమ్మెల్యే పుట్టిన రోజుకు హెలిక్యాప్టర్‌లో వెళ్లిన మంత్రులు.. వీడియో వైరల్‌!

పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు. ఎలాంటి పదవులు లేవు. దీంతో ఇంతకాలం నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఇటీవలి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. దీంతో తమకు పట్టపగ్గాలు లేవన్నట్లు వ్యవహరిస్తున్నారు. మనల్నెవడ్రా అడిగేతి అన్నట్లుగా ప్రజాధనం వృథా చేస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 7, 2024 / 08:52 AM IST
    MLA Manohar Reddy Birthday

    MLA Manohar Reddy Birthday

    Follow us on

    MLA Manohar Reddy Birthday: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. పదేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్‌ నేతలు.. ఈసారి పార్టీ గెలవకపోతే తమ భవిష్యత్తు అంధకారమే అనుకున్నారు. కానీ ప్రజలు వాళ్ల నెత్తిన పాలు పోశారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ పాలనతో విసిగిపోయి ఉన్న ఓటర్లు.. హస్తం పార్టీని అక్కున చేర్చుకున్నారు. మెజారిటీ సీట్లు గెలిపించి అధికారం కట్టబెట్టారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇక మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఉన్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండడం, ఎలాంటి పదవి లేకపోవడంతో ఇన్నాళ్లూ నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు అధికారంలోకి రావడం, మంత్రి పదవులు దక్కడంతో ఇక రెచ్చిపోతున్నారు. తాము ఆడిందే ఆట.. పాడిదే పాట అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ధనిక రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్న మంత్రులు తాము ఏం చేస్తున్నామన్న విషయం మర్చిపోతున్నారు. ఎదుటివాడిని ఒక వేలు ఎత్తి చూపితే నాలుగు వేళ్లు మనల్ని చూపిస్తాయన్నట్లు.. బీఆర్‌ఎస్‌ అప్పులను వేలెత్తి చూపుతున్న కాంగ్రెస్‌ మంత్రులు తమ తప్పు మాత్రం గుర్తించడం లేదు. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం మాత్రం మర్చిపోవద్దు.

    ఎమ్మెల్యే పుట్టిన రోజుకు హెలిక్యాప్టర్‌..
    అధికారం ఉంది కదా.. ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే పొరపాటే. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించింది. తెలంగాణ తెచ్చినం.. అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా అడిగేవారు ఉండరని మొన్నటి వరకు గులాబీ నేతలు భావించారు. కానీ ఇది ప్రజాస్వామ్యం. ప్రజలను గౌరవించకపోతే.. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని లాక్కుంటారన్న వాస్తవం గుర్తించలేదు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీని గద్దె దించారు. దీని నుంచి కాంగ్రెస్‌ నేతలు చాలా నేర్చుకుంటారని అంతా భావించారు. కానీ, తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి హాజరయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఆర్య వైశ్య కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ కాల్వ సుజాత హెలిక్యాప్టర్‌లో ఈ వేడుకలకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో చెక్కుర్లుకొడుతున్నాయి.

    ప్రజాసంఘాల ఆగ్రహం..
    ఇప్పటికే రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అధికార కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు. నిధులు పొదుపుగా వాడతామని, వృథా తగ్గిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందుకే తాను కొత్త కాన్వాయ్‌ తెప్పించలేదని, ఉన్న కార్లతోనే సర్దుకుంటున్నానని తెలిపారు. కానీ, రేవంత్‌ క్యాబినెట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ప్రజాధనం వృథా చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కారులో వెళ్లాల్సిన కార్యక్రమానికి హెలిక్యాప్టర్‌ వాడడంపై మండిపడుతున్నారు. తమ సొమ్ము కాకపోతే ఏమైనా చేస్తాం అన్నట్లుగా మంత్రి తీరు ఉందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రులు జాగ్రత్తగా ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. విలాసాల కోసం ప్రజాధనం వృథా చేయొద్దని కోరుతున్నారు.