CM Revanth Reddy: తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ కవి పేరు.. సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన నిర్ణయం !

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఇచ్చిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాలనుకుంటోంది. ఇందులో భాగంగానే పదేళ్ల తర్వాత తెలంగాణ అధికారిక గేయాన్ని ఎంపిక చేసింది. ఇక టీఎస్‌ను టీజీగా మార్చింది. తాజాగా తెలుగు విశ్వవిద్యాలయం పేరుపై కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది .

Written By: Raj Shekar, Updated On : August 2, 2024 4:27 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలుగు విశ్వవిద్యాలయానికి తెలుగు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టి గౌరవించారు. అయితే దాదాపు 60 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా జంతువు, మొక్క, పక్షితోపాటు పండుగలను ప్రకటించారు. అయితే పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ తెలంగాణకు మాత్రం అధికారిక గీతం ఎంపిక చేయలేదు. దీంతో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ తెలంగాణ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణ అధికారిక గీతాని ప్రకటించింది. తెలంగాణ లోగోను కూడా మార్చాలని భావించింది. అయితే వ్యతిరేకత రావడంతో పసంహరించుకుంది. ఇక తాజాగా తెలంగాణలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రాకు చెందిన పొట్టి శ్రీరాములు పేరు ఉన్న నేపథ్యంలో మళ్లీ దానిని మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. పొట్టి శ్రీరాములు పేరు తొలగించి తెలంగాణ ప్రాంత కవి పేరు పెట్టాలని అనుకుంటున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

సురవరం పేరు…
అమరజీవి పొట్టి శ్రీరాముల పేరుతో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం పేరుతో ఉన్న తెలుగు యూనివర్శిటీ పేరు మార్చడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలుగు యూనివర్సిటీకి తెలంగాణ కవి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యేలంతా తమ నిర్ణయం తెలుపాలని కోరారు. సభ అంగీకరిస్తే పేరు మార్చేందుకు ముందుకు వస్తామని తెలిపారు. అనవసర రాద్ధాంతం లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. ‘బహుముఖ ప్రజ్ఞాశీలిగా పేరు ఉన్న సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్‌ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఆ విషయం గురించి ఆలోచించాలని సురవరం సుధాకర్‌రెడ్డి సభకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న సభ్యులకు విన్నవించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాముల పేరు ఉందని, టీఎస్‌ను టీజీగా మారిస్తే చాలా మంది అభ్యంతరం చెప్పారన్నారు. అలాంటి కాంట్రవర్సీ లేకుండా ఉండేందుకు ఏకతాటిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆయన రచనలు, ఆయన స్థాపించిన గోల్కొండ పత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. సభలో అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తే పేరు మార్చడానికి సురవరం ప్రతాప్‌రెడ్డి పెట్టడానికి మాకు ఎలాంటి అభిప్రాయం లేదని ప్రకటించారు.

పేరు మార్పుకు అంగీకారం..
సీఎం చేసిన విజ్ఞప్తిపై అన్ని పార్టీల నాయకులు అసెంబ్లీలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ తరఫున కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ కవులు, ఉద్యమకారులను గౌరవించుకోవడం మన విధి అన్నారు. ఈమేరకు తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, కవుల పేర్లు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. బీజేపీ, ఎంఐఎం, సీపీఐ కూడా యూనివర్సిటీ పేరు మార్పుకు అంగీకరించాయి.

త్వరలో గెజిట్‌..
అసెంబ్లీలో అన్ని పార్టీలు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పునకు అంగీకరించిన నేపథ్యంలో త్వరలోనే దీనికి సంబంధించిన గెజిట్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఫార్మాలిటి పూర్తి చేసిన తర్వాత యూనివర్సిటీ పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారని నాయకులు తెలిపారు.

యూనివర్సిటీ చరిత్ర ఇదీ..
1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. 1985, డిసెంబర్‌ 2న స్థాపించారు. భారతదేశంలోని భాష ప్రాతిపదికన స్థాపించబడిన తొలి విశ్వవిద్యాలయం ఇదీ. ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం ఇందులో విలీనం చేయబడింది. రాజమండ్రిలో విశ్వవిద్యాలయం శాఖ ఉంది. ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలలో తెలుగు భాష అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న సాహిత్య, సంగీత, నాటక, నృత్య, లలిత కళా అకాడమీలను, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని ‘పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, సాంస్కృతిక శాఖలో భాగమైంది. 2022, జూలై 20న విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం జరుపుకుంది.