
తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు పంటల విషయంలో కీలక సూచనలు చేస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ వచ్చే యాసంగిలో రైతులు మొక్కజొన్న పంటను వేయవద్దని చెప్పారు. రాష్ట్రంలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి ఆసక్తి చూపితే బాగుంటుందని అన్నారు. మొక్కజొన్న నిల్వలు దేశంలో భారీగా పెరిగిపోయినట్లు కేసీఆర్ వెల్లడించారు.
ప్రస్తుతం మన దేశం నుంచి మొక్కజొన్న పంటను విదేశాలు సైతం దిగుమతి చేసుకునే అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న సీఎం కేసీఆర్ అధికారులతో పంటల సాగు, మార్కెటింగ్ అంశాల గురించి చర్చించారు. అధికారులు యాసంగి కాలంలో మొక్కజొన్న్ పంట వేసిన రైతులు నష్టాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ప్రస్తుతం మొక్కజొన్న పంటను సాగు చేయడం వల్ల నష్టాలే తప్ప లాభాలు రావని చెప్పారు.
దేశంలో అంతర్జాతీయ మార్కెట్ల అవసరాలను పరిగణనలోకి తీసుకోకపోయినా 28 కోట్ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వలు ఉన్నాయని సమాచారం. మరోవైపు కేంద్రం మొక్కజొన్న పంటపై సుంకం తగ్గిస్తున్న నేపథ్యంలో ఈ పంటకు కనీస మద్దతు ధర లభించే అవకాశాలు లేవు. మొక్కజొన్న పంట వేసిన రైతులకు లాభాలు రావడం కష్టమేనని అధికారులు అభిప్రాయపడ్డారు.
అధికారుల అభిప్రాయాలను, దేశంలోని మొక్కజొన్న నిల్వలకు సంబంధించిన గణాంకాలను పరిశీలించి సీఎం కేసీఆర్ యాసంగిలో మొక్కజొన్న పంట వేయవద్దని చెప్పారు. రైతులు ఇష్టానుసారం పంటలు వేయడం వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయని భావించి సీఎం కేసీఆర్ రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలను ప్రకటిస్తున్నారు.