CM Revanth Reddy: రుణమాఫీ సరిగ్గా కాలేదని ఆరోపణలు.. రైతుబంధును వేయకుండా నిలుపుదల చేశారని ఆరోపణలు.. హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యవస్థను సర్వనాశనం చేశారని దెప్పిపొడుపులు.. రైతుల కష్టాలు పట్టించుకోవడంలేదని ఆగ్రహాలు.. ఇలాంటి పరిణామాలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల నుంచి ఒకింత ఉక్కపోత వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు.
వాటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ.. వచ్చేకాలంలో రేవంత్ కు మరింత ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ స్థానిక ఎన్నికల నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. ఇందులో భాగంగా కులగణన అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణనను చేపడతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రం ప్రస్తుతం కులగణన చేపట్టడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ విషయాన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టారు. చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుగా ఉండేందుకు ఏకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నవంబర్ ఐదు న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారు. కుల గణన అంశంపై ఆయన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కల్పిస్తోంది. తెలంగాణ వేదికగా కుల గణన విషయాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించబోతున్నారు.. కుల గణన వల్ల బీసీలను లెక్కించి.. వారికి జనాభా దమాషా పద్ధతిలో అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందువల్లే కులగణన చేపడతామని చెబుతోంది.
చట్టబద్ధమవుతుందా?
కుల గణన చట్టబద్ధం కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం రాజకీయం కోసం మాత్రమే ఈ ప్రక్రియ చేపడుతున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నితీష్ కుమార్ ఇదే విధానాన్ని కొనసాగించారు. దాని ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారు. అయితే దానిని న్యాయస్థానం కొట్టి పారేసింది. దీంతో నితీష్ కుమార్ సమర్ధించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కులగణన వద్దని స్పష్టం చేస్తోంది. అయితే కులగణన చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. దీనివల్ల బీసీ వర్గాలు తమకు దగ్గరవుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇవాల్టి వరకు కాంగ్రెస్ పార్టీకి బీసీలు, ఎస్టీలు, ఏసీలు మాత్రమే అండగా ఉన్నారు. మైనారిటీలు కూడా బలమైన మద్దతు దారులుగా ఉన్నారు. ఒకవేళ బీసీలు కూడా మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ పూర్వ స్థితిని సంతరించుకుంటుందని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ ఆశయాలను అమలు చేస్తున్నారు. ఇలా చేస్తే రాజకీయంగా మైనస్ ఉంటుందని తెలిసినప్పటికీ.. వాటిని సమర్థవంతంగా పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కుల గణన ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఒకవేళ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తే రేవంత్ రెడ్డికి తెలంగాణ సమాజంలో తిరుగు లేని స్థాయిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఇప్పటికే బీసీ కమిషన్ తెలంగాణలో పర్యటిస్తోంది. పలు ప్రాంతాలలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోంది.