https://oktelugu.com/

Telangana Elections 2023: అటు కెసిఆర్.. ఇటు రేవంత్ రెడ్డి.. కామా రెడ్డిలో విజేత ఎవరు?

కామారెడ్డి నియోజకవర్గంలో హైదరాబాదులోని పాతబస్తీ తర్వాత ముస్లిం జనాభా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. కామారెడ్డి ఉత్తర తెలంగాణలో ఉంటుంది. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి హవా కొనసాగుతోంది.

Written By: , Updated On : November 16, 2023 / 12:54 PM IST
Telangana Elections 2023

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: నిన్నా మొన్నటిదాకా ఒక మామూలు నియోజకవర్గం. పెద్దగా ప్రాచుర్యంలో ఉండేది కూడా కాదు. మాస్టర్ ప్లాన్ వివాదం నేపథ్యంలో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ నియోజకవర్గమే పెద్ద వార్త అయిపోయింది.. ఇందుకు ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండమే దానికి కారణం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ఫోకస్ కేవలం కామారెడ్డి మీదనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ కామారెడ్డిని ముఖ్యమంత్రి ఎందుకు ఎంచుకున్నారు? రేవంత్ రెడ్డి ఎందుకు పోటీ చేస్తున్నారు? ఈ ఇద్దరి నేతల బలాలు ఏమిటి? ఎవరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి? దీనిపై ప్రత్యేక కథనం.

ముస్లిం జనాభా ఎక్కువ

కామారెడ్డి నియోజకవర్గంలో హైదరాబాదులోని పాతబస్తీ తర్వాత ముస్లిం జనాభా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. కామారెడ్డి ఉత్తర తెలంగాణలో ఉంటుంది. ఉత్తర తెలంగాణలో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి హవా కొనసాగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కామారెడ్డి ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని వివిధ సర్వేల్లో వెళ్ళడైంది. ఇక్కడి ముస్లింలతో పాటు ఇతర వర్గాల ఓట్లను కూడా కాంగ్రెస్ చీల్చితే అది భారత రాష్ట్ర సమితికి పెద్ద మైనస్ పాయింట్ గా మారే అవకాశం ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి అత్యంత తెలివిగా ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందువల్లే గంప గోవర్ధన్ ను పక్కన పెట్టారని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి.

కేసీఆర్ గేమ్ ప్లాన్ ఏంటి

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే వ్యూహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నియోజకవర్గంలో బరిలోకి దిగారని భారత రాష్ట్ర సమితి వర్గాలు అంటున్నాయి. గట్టిగా పట్టు ఉన్న ఉత్తర తెలంగాణలో మరింత గ్రిప్ సంపాదించడం, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వెళ్లకుండా చూడటం, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కవితకు లైన్ క్లియర్ చేయడం వంటి అంశాలతోనే కెసిఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారని విలేకరులు అడిగినప్పుడు దాని వెనుక చాలా వ్యూహాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ వ్యూహాలు ఇవేనని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లను భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వెళ్లకుండా చూడటమే కెసిఆర్ అసలు ప్లాన్ అని వారు వివరిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమిటో

కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అందుతున్న సర్వేల ప్రకారం ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి.. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు కోల్పోయింది. ఇక్కడ లెక్కకు మిక్కిలి సీట్లు సాధిస్తేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. దానిని కామారెడ్డిలో సాధించిన విజయం ద్వారా నిరూపించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. పైగా గతంలో కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడ పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందువల్లే కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డి లో విజయం సాధిస్తే ఉత్తర తెలంగాణలో పార్టీ క్యాడర్ లో కొండంత బలం పెంచినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్ స్థానంలో కేసీఆర్ మీద ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ఆయన కూడా బలమైన అభ్యర్థి కావడంతో అటు కామారెడ్డి, ఇటు గజ్వేల్ స్థానాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా దురుస్తాదించాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు భారత రాష్ట్ర సమితిని ఎంతోకొంత కట్టడి చేయవచ్చని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నది. రెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తనపై ఎక్కువ ఫోకస్ పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కామారెడ్డిలో ఉన్న ముస్లిం ఓట్లను, కాంగ్రెస్ శ్రేణులను ఒకటి చేయగలిగితే తిరుగు ఉండదని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. కామారెడ్డిలో రేవంత్ ఓడిపోతే పెద్దగా చర్చ జరగదు. కానీ అద్భుతం జరిగి కేసీఆర్ ఓడిపోతే మాత్రం రాజకీయంగా సంచలనంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో పెద్దపెద్ద నాయకులు రెండు చోట్ల నుంచి పోటీ చేసిన సందర్భాల్లో కొన్నిసార్లు వారికి నష్టం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ కూడా ఇలా రెండు పడవలపై ప్రయాణం చేసి ఒకచోట ఓడిపోయారు. కాగా, ఇటు రేవంత్ వర్గం, అటు కేసీఆర్ వర్గం హోరాహోరీగా ప్రచారం చేస్తుండడంతో కామారెడ్డి ఓటర్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతానికి గుంబనంగానే ఉన్నప్పటికీ వారు ఎటువైపు మొగ్గుతారు అనేది ఆసక్తికరంగా ఉంది.