
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల విద్యార్థులకు గతేడాది తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తరగతులు ఆలస్యం కావడం వల్ల ప్రవేశ పరీక్షలు కూడా ఈ ఏడాది ఆలస్యంగా జరగనున్నాయి. అయితే 2021 – 2022 విద్యా సంవత్సరానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి నుంచి ఎంసెట్, పీజీఈసెట్, ఈసెట్ పరీక్షలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఉన్నత విద్యామండలి ప్రతి సంవత్సరం 7 కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించేది.
అయితే కరోనా పరిస్థితుల వల్ల మొదట ముఖ్యమైన పరీక్షలకు సంబంధించిన తేదీలను అధికారులు ప్రకటించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ టి. పాపి రెడ్డి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. జూన్ 20వ తేదీన పీజీఈసెట్, జులై 1వ తేదీన ఈసెట్, జులై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు ఆన్ లైన్ లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ఎంసెట్ పరీక్ష ద్వారా బీటెక్, బీ ఫార్మసీ, అగ్రికల్చర్ బీఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. ఎంసెట్ లో మొదట అగ్రికల్చర్ పరీక్ష నిర్వహిస్తారా..? లేక ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహిస్తారా..? తెలియాల్సి ఉంది. మరోవైపు కేంద్రం అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నీట్ పరీక్షకు సంబంధించిన తేదీలను ఇప్పటివరకు ప్రకటించలేదు. నీట్ పరీక్ష తేదీలు వెల్లడైతే ఇతర పరీక్ష తేదీలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది.
పీజీ ఈసెట్ పరీక్షలు కూడా ఆన్ లైన్ లోనే జరుగుతాయని తెలుస్తోంది. పీజీఈసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్ సెట్ పరీక్ష తేదీలను మాత్రం తర్వాత ప్రకటించనున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా ప్రవేశ పరీక్షలు ఆలస్యంగా జరుగుతుండటం గమనార్హం.