
ఆ గ్రామాల్లో రెండు ఓటరు కార్డులున్నాయి.. అక్కడి ప్రజలు ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు..రెండు ప్రభుత్వాల పరిధిలో ఉండే ఈ గ్రామాలకు ఇరువైపుల నుంచి సంక్షేమ పథకాలు అందడంతో పాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. అయితే గ్రామాలు తమదంటే తమయని పట్టుబడుతున్నాయి.. కానీ అధికారికంగా మాత్రం అవి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి కావు. ఇంతకీ ఆ గ్రామాలు ఎక్కడున్నాయి..? కొండ కోనల్లో ఉన్న ఆ గ్రామాలపై ఆ ప్రభుత్వాలు ఎందుకంత ప్రేమను చూపిస్తున్నాయి…?
ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాయి కొటియా గ్రామాలు. ఏపీ సరిహద్దులోని విజయనగరం జిల్లా, ఒడిశా బార్డర్ లోని కోరాపుట్ జిల్లా సరిహద్దుల్లోని 21 గ్రామాలను కొటియా గ్రామాలంటారు. ఇక్కడ 15 వేల మంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరిలో 3,902 ఓటర్లున్నారు. ఈ గ్రామాల విషయంలో అటు ఆంధ్ర, ఇటు ఒడిశా ప్రభుత్వాల మధ్య నిత్యం వివాదం నెలకొంటుంది. ఈ వివాదం రావడానికి గల కారణమేంటంటే..?
1942లో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రాలను విభజించింది. ఇందులో ఏపీ, ఒడిశా సరిహద్దులను నిర్ణయించేందుకు సర్వే కోసం వచ్చారు. ఈ సర్వేలో 101 గ్రామాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. రాను రాను వీటిలో కొన్నింటిని అటు ఒడిశా, ఇటు ఏపీ కలుపుకున్నాయి. ఇంకా 21 గ్రామాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇవి తమదంటే తమదేనడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. దీంతో 1968లో సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కోర్టు స్టేటస్ కో విధించింది. దీంతో ఈ గ్రామాల వివాదం అప్పటినుంచి అలాగే ఉంటోంది.
21 గ్రామాలున్న ఇవి విస్తరణలో వాటి సంఖ్య 34 కు చేరింది. అయితే ఇక్కడి ప్రజలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి. ఇక్కడి వారికి ఆంధ్రా, ఒడిశా రేషన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయి. దీంతో వీరు ఇద్దరు ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే ఆంధ్ర కంటే ఒడిశా ఈ గ్రామాలపై ఎక్కువ ప్రేమ చూపుతోంది. ఇప్పటికే ఇక్కడ తారు రోడ్లు వేయించింది. పోలీస్ ష్టేషన్ నిర్మిస్తోంది. అయితే ఆంధ్రప్రభుత్వం నుంచి మాత్రం సంక్షేమ పథకాలు పొందుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఇరు రాష్ట్రాల్లో ఇంతకు మించి కొండకోనల్లో ఉన్నవారిని పట్టించుకోని ప్రభుత్వాలు వీరిపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నారు..? అంటే ఇక్కడ బోలేడు ఖనిజ సంపద దాగి ఉందట. వాటిని దక్కించుకోవాలంటే ఇక్కడి గిరిజన ప్రజలను అక్కున చేర్చుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే ఖనిజాల కోసం అక్కడక్కడా తవ్వకాలు ప్రారంభించిందట. ఈ ప్రాంతంలో ఎక్కువగా బాక్సైట్ లభించే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. అందుకే ఈ గ్రామాలపై రెండు ప్రభుత్వాలు ప్రేమను చూపుతున్నాయని అర్థమవుతోంది.
అయితే ఈ గ్రామాలన్నీ తమవేనని, ఆంధ్ర ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించుకుంటుందని ఒడిశాకు చెందిన బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చిన వారికి, ఒడిశా బీజేపీ నాయకుల మధ్య వివాదాలు జరిగాయి. ఆంధ్ర ప్రభుత్వం కొటియా గ్రామాలను ఆక్రమించుకునే విషయంపై ప్రభుత్వం స్పందించాలని ఒడిశాకు చెందిన బీజేపీ నాయకులు తమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.