Teenmar Mallanna: కేవలం ఈ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా.. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశాడు. ఇవి కాస్త రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. చివరికి మాజీ మంత్రి కేటీఆర్ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావించేదాకా వెళ్ళింది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్ అలా మాట్లాడిన తర్వాత కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తీన్మార్ మల్లన్న వ్యవహారం శైలి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందని నాయకులు అంతర్గత చర్చల్లో పేర్కొంటున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వ్యవహార శైలి మార్చుకోకపోతే పార్టీ నుంచి సస్పెండ్ లేదా డిస్మిస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించిందని సమాచారం. అయితే దీనిపై తీన్మార్ మల్లన్న కూడా అదే స్థాయిలో స్పందించారని.. ఘాటు వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన యూట్యూబ్ ఛానల్ లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. ” నాకు నోటీసులు ఇవ్వడానికి మీరు ఎవరు?, కాంగ్రెస్ పార్టీ ఏమైనా మీ జాగీరా?, కాంగ్రెస్ పార్టీ అనేది మాది. నన్ను బెదిరించాలని చూస్తే నడవదు. నాకు అన్యాయం చేయాలని చూస్తే పండబెట్టి తొక్కుతా.. కొంతమంది ఎమ్మెల్యేలు కుల గణన సర్వే బాగోలేదని చెప్పకుండా.. పారదర్శకంగా ఉందని ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారు. ఇది సమగ్ర కుల సర్వే కాదు.. అగ్రకుల సర్వే అని” తీన్మార్ మల్లన్న మండిపడ్డారని తెలుస్తోంది.
ఏం చేస్తుందో?
తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుముఖంగా లేరని తెలుస్తోంది.. అంతర్గతంగా తీన్మార్ మల్లన్న పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరో వైపు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఆయన నోరును అదుపులో పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని.. లేకపోతే పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతోందని వారు అధిష్టానం ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. ” కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ ఆయన మాత్రం వ్యక్తిగత లాభం కోసం పనిచేస్తున్నారు. మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆయన నోటిని అదుపులో పెట్టుకునే విధంగా అధిష్టానం చర్యలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని” కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిష్టానం ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది. మరి తీన్మార్ మల్లన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.