Mancherial: తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఉపాధ్యాయుల బదిలీలు పూర్తిచేసింది. దీంతో వేల మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి కొత్త పాఠశాలలకు వెళ్లారు. ఇన్నాళ్లూ తమతో ఉన్న గురువులు వెళ్లిపోతుంటే విద్యార్థులు భావోద్వేగానికి లోనవుతున్నారు. గురువులను చుట్టుముట్టి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి దృశ్యాలు తెలంగాణ వ్యాప్తంగా పక్షం రోజులుగా పాఠశాలల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లడంతో ఆ పాఠశాల విద్యార్థులు కూడా గురువు వెంటే వెళ్లిపోయారు. ఈ అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
మారిన పాఠశాల తీరు..
జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా జాజాల శ్రీనివాస్ 2012 జూలై 13న చేరారు. అప్పుడు ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు కేవలం ఐదు తరగతులు 32 మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. శ్రీనివాస్ వచ్చాక పాఠశాల తీరు మారింది. ఆటపాటలతో విద్యా బోధన చేయడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 250కి పెరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలని నిర్ణయించుకున్నారు.
గురువు వెంటే శిష్యులు..
జూలై 1వ తేదీన శ్రీనివాస్ బదిలీ అయ్యారు. జన్నారం మండలంలోనే ప్రస్తుతం ఉన్న పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కపెల్లి గూడ పాఠశాలకు వెళ్లారు. దీనిని పొనకల్ పాఠశాల విద్యార్థులు తట్టుకోలేకపోయారు. తమకు ఎంతో ఇష్టమైన మాస్టారు పనిచేస్తున్న పాఠశాలకే తాము వెళ్తామని 133 మంది విద్యార్థులు అక్కపెల్లి గూడ పాఠశాలకు వెళ్లారు. జూలై 2, 3వ తేదీల్లో తల్లిదండ్రులు పొనకల్ పాఠశాలలో టీసీ తీసుకుని తమ పిల్లలను అక్కపెల్లిగూడ పాఠశాలలో చేర్పించారు. దీంతో జూన్ 30న 21 మంది విద్యార్థులున్న అక్కపెల్లిగూడ పాఠశాల ఇప్పుడు 154 మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. ఈ పాఠశాలలో ప్రస్తుతం జాజాల శ్రీనివాస్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.