SLBC Tunnel incident: ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చోటు చేసుకున్న ప్రమాదంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. టన్నెల్ లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటికి తీసుకొచ్చేందుకు ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంది. ఇప్పటికీ రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటూనే ఉన్నాయి. ఇటీవల ర్యాట్ హోల్ మైనర్స్ ను తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఇప్పుడు మరో బృందాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది
ఎస్ ఎల్ బీ సీ లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయట తీసుకురావడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్మికులు టన్నెల్ లో చిక్కుకొని నేటికీ ఆరు రోజులు. ఇప్పటికీ వారి కోసం రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆ ఎనిమిది మందిని ప్రాణాలతో బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రెస్క్యూలో భాగంగా టన్నెల్ లో ఏర్పడిన పరిస్థితులు కఠిన సవాల్ గా మారాయి. టన్నెల్ లో జీరో పాయింట్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే అందులో ఉన్న శిథిలాలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఆశించిన ఫలితం రాకపోవడంతో ప్రభుత్వం ప్రస్తుతం మార్కస్ కమాండో (ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్) ను రంగంలోకి దించింది. ప్రస్తుతం ఇతర రెస్క్యూ బృందాలతో కలిసి మార్కస్ కమాండో లు సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. జీరో పాయింట్ వద్ద శిధిలాలు తొలగించే పనిని ఈ బృందాలు మొదలుపెట్టాయి.
ఉత్తమ్ ఆగ్రహం
టన్నెల్ వద్ద సహాయక చర్యలను ఎప్పటికప్పుడు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇదే క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు. కార్మికులను గుర్తించడానికి 11 భాగాలు పనిచేస్తున్నాయి. గుర్తింపు పొందిన నిపుణులతో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.. కూలిపోయిన మట్టిని త్వరగానే తొలగిస్తున్నాం. ఆ తర్వాత ఎస్ ఎల్ బి సి పనులను రెండు మూడు నెలల్లో పున: ప్రారంభిస్తాం. ఎస్ ఎల్ బి సి ప్రమాదంపై భారత రాష్ట్ర సమితి లేనిపోని భయాందోళనలు సృష్టిస్తోంది. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో ఆరుగురు చనిపోతే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎస్ ఎల్ బి సి ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోయారు. అప్పుడు కెసిఆర్ అక్కడికి వెళ్లలేదు. మాసాయిపేటలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కెసిఆర్ ఒక్క అడుగు కూడా బయట వేయలేదు. ఇప్పుడు ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి నాయకులు కావాలని బురద చల్లుతున్నారు. టన్నెల్ ఘటనను కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ ఫై విమర్శలు చేస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు.. తమ పరిపాలనలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుంచుకోవాలని” ఉత్తం కుమార్ రెడ్డి హితవు పలికారు.. మరోవైపు ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారంతా చనిపోయారని.. ఓ వర్గం మీడియా తెగ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. తమ రాజకీయం కోసం కార్మికులు చనిపోయారని ప్రచారం చేయడం ఆ పార్టీ దివాళా కోరుతనం రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.