Revanth Reddy And KCR: తెలంగాణ రాజకీయ చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమతి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమతి అధినేత కేసీఆర్(కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు), తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఒకప్పుడు తెలంగాణ సాధన కోసం కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నాయకులు, రాజకీయంగా వేర్వేరు మార్గాలను ఎంచుకుని, తెలంగాణ ముఖ్యమంత్రులుగా ఎదిగారు.
Also Read: తొందరపాటు నిర్ణయాలు..దిక్కుతోచని స్థితిలో డైరెక్టర్ క్రిష్ ఘాటీ!
ఇద్దరూ ఆ తాను ముక్కలే..
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అనుముల రేవంత్‌రెడ్డి.. ఇద్దరూ తమ రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీడీపీని వీడారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పేరుతో కొత్త పార్టీ పెట్టారు. ఇక రేవంత్‌రెడ్డి కేసీఆర్ స్థాపించిన పార్టీలో చేరారు. ఇద్దరూ ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారు. రేవంత్ పోరాటపటిమను చూసిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కేసీఆర్ పిలుపుతో రేవంత్‌రెడ్డి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనేక పోరాటాలను చేశారు. తెలంగాణ రాష్ట్రసమితిని ఆ జిల్లాలో బలోపేతం చేస్తూ, ఉద్యమ లక్ష్యాల కోసం కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌కు విశ్వాసపాత్రమైన సహచరుడిగా నిలిచారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ కార్యకలాపాలను నిర్వహిస్తూ, ఉద్యమానికి ఊపిరి పోశారు. ఈ కాలంలో ఆయన చూపిన అంకితభావం, తెలంగాణ ఉద్యమంలో జిల్లాకు గుర్తింపు తెచ్చింది, రేవంత్‌ను ఒక ఉద్యమ నాయకుడిగా స్థాపించింది.
రాజకీయ విభేదాలు.. వేర్వేరు దారులు
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య రాజకీయ విభేదాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ టీడీపీలోచేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు, తర్వాత ఆ పార్టీని 2023 ఎన్నికల్లో విజయపథంలో నడిపించి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఈ విభేదం వారి రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కేసీఆర్ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గెలిపించి తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
ఇద్దరూ ముఖ్యమంత్రులుగా..
కేసీఆర్ 2014 నుచి 2023 వరకు రెండు పర్యాయాలు తెలంగాణకు సీఎంగా పనిచేశారు. రాష్ట్ర అభివృద్ధికి గణనీయ కృషి చేశారు. రేవంత్ రెడ్డి, 2023లో కాంగ్రెస్ విజయంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, రాష్ట్రానికి కొత్త దిశను అందిస్తున్నారు. ఇద్దరి నాయకత్వ శైలి వేరైనప్పటికీ, తెలంగాణ రాజకీయాలపై వారు చూపిన ప్రభావం గణనీయమైనది.
కేసీఆర్ కోసం రేవంత్ రెడ్డి చూపిన అంకితభావం, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కృషి రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన గుర్తుగా నిలిచింది. రాజకీయంగా వేర్వేరు మార్గాలను ఎంచుకున్నప్పటికీ, ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర సాధన, అభివృద్ధిలో తమదైన ముద్ర వేశారు. ఈ రాజకీయ యాత్ర తెలంగాణ చరిత్రలో ఒక ఆసక్తికర అధ్యాయంగా మిగిలిపోతుంది.