CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా దర్బార్ ప్రారంభించారు. కీలక శాఖల ప్రగతిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా త్వరలో కుటుంబ సమేతంగా విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నట్లు సమాచారం.
ఏపీలో సైతం రేవంత్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్న సమయంలో.. ఆ పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాలకు హాజరయ్యేవారు. మహానాడు తో పాటు సమైక్యాంధ్ర ఉద్యమం, అటు తరువాత టిడిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన చాలా సభలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఆయన వాగ్దాటికి ఏపీ టీడీపీ శ్రేణులు ఫిదా అయ్యేవి. ఆయన పార్టీ మారినా.. తమ సొంత పార్టీ నేతగా టిడిపి శ్రేణులు భావిస్తుంటాయి. అటువంటి రేవంత్ రెడ్డి సీఎం కావడం.. ముఖ్యమంత్రి హోదాలో వస్తుండడంతో టిడిపి శ్రేణులు ఆనందిస్తున్నాయి. ఆత్మీయ స్వాగతానికి సిద్ధపడుతున్నాయి.
అయితే రేవంత్ రెడ్డి ప్రైవేటు పర్యటనకు వస్తుండడంతో మరో ప్రచారం జరుగుతోంది. రేవంత్ ఏపీ సీఎం జగన్ ను కలుస్తారని టాక్ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని ఉద్దేశంతో.. ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన నాడు.. ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి రేవంత్ రియాక్ట్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పునరంకితం అవుదామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంలు కలుస్తారని ప్రచారం జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.