AP Elections 2024
AP Elections 2024: ఏపీలో ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయా? బిజెపి అదే మంచి సమయమని భావిస్తోందా? ఆ మేరకు ఎలక్షన్ కమిషన్ కు సూచనలు ఇచ్చిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. మూడింట బిజెపి గెలుపొందింది. మంచి ఊపు మీద ఉంది. అందుకే ప్రతిపక్షాలకు ఏమాత్రం సమయం ఇవ్వకూడదని భావిస్తోంది. అందుకే షెడ్యూల్ కంటే నెల రోజులు ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇటీవల చంద్రబాబు సైతం.. ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన అనుమానం వెనుక.. కేంద్ర వర్గాల నుంచి సమాచారం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. బిజెపికి వచ్చే ఎన్నికల్లో సీట్లు తగ్గడం ఖాయమని సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాలు సాధించడం కూడా బిజెపి ముందస్తు ఎన్నికలకు ఒక కారణం. ముఖ్యంగా ఇండియా కూటమిలో బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండడం.. కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకోవడం.. ఇటువంటి కారణాలతో బిజెపి కలవరపాటుకు గురవుతోంది. అందుకే ఊపు ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహిస్తే సత్ఫలితాలు వస్తాయని భావిస్తోంది. అందుకే ఒక నెల రోజులు ముందుగా నైనా ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు తేలుతోంది. అయితే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిస్సా వంటి రాష్ట్రాలకు సైతం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఏపీలో ఎన్నికలు పండగ తరువాతనని తెలుస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికలకు మార్చి పదో తేదీన షెడ్యూల్ విడుదలైంది. మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ జరిగింది. జూన్లో కౌంటింగ్ జరిగింది. అప్పట్లో ఈ సుదీర్ఘ ప్రక్రియపై విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తమయింది. నాలుగు విడతల్లోనే ఎన్నికలు పూర్తి చేయాలన్న యోచనలో ఉంది. రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియ ముగించాలని బలమైన ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ పనులు ముమ్మరం చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం, ఈవీఎంలను నియోజకవర్గాలకు చేర్చడం వంటి ప్రక్రియ సెరవేగంగా పూర్తయింది. అటు ఓటర్ల జాబితాను అప్డేట్ చేసే ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సంక్రాంతి తరువాత.. లేకుంటే ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని విధాలా సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.