Revanth Reddy key decision: సరిగ్గా రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. కేసీ వేణుగోపాల్ రెడ్డితో చాలాసేపు మాట్లాడారు. ఈ సమయంలో వారి వెంట మీనాక్షి నటరాజన్ కూడా ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాత వేణుగోపాల్ రెడ్డితో రేవంత్ రెడ్డి చాలాసేపు మాట్లాడారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారు? మంత్రుల మీద రేవంత్ కంప్లైంట్ చేశారా? ఆ నివేదికను కూడా వేణుగోపాల్ రెడ్డికి ఇచ్చారా? ఇవే ప్రశ్నలు నిన్నటి వరకు మీడియాలో వినిపించాయి. అయితే అందులో నిజం లేదని.. వేణుగోపాల్ రెడ్డి తో రేవంత్ రెడ్డి మాట్లాడింది వేరే విషయం మీద అని తెలిసింది..
వారిద్దరూ అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది.. అంత ముఖ్యమైన విషయం ఏముంది.. అని చర్చ జరుగుతుండగా ఆసక్తికరమైన విషయం తెలిసింది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఇటీవల మంత్రివర్గాన్ని విస్తరించిన క్రమంలో ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి కొంతమంది పేర్లు సిఫారసు చేసినప్పటికీ.. సామాజిక కోణంలో ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి సిఫారసులను పక్కన పెట్టింది. వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్.. వంటి వారికి మంత్రి పదవులు లభించాయి.. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణలో కొంతమందికి చోటు కల్పిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అది మలి విడతకు వాయిదా పడింది.
ఇప్పుడు జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో అజహారుద్దీన్ కు చోటు లభిస్తుందని తెలుస్తోంది. కెప్టెన్ ఇటీవల జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. ఆ టికెట్ విషయంలో నవీన్ యాదవ్ కు ముఖ్యమంత్రి గట్టిగా నిర్ణయించుకున్న నేపథ్యంలో.. అత్యంత తెలివిగా అధిష్టానం వద్ద పావులు కదిపారు. ఆ తర్వాత అజహారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మంత్రిని కూడా చేయబోతున్నారు. అతి త్వరలో అజహర్ మంత్రి కాబోతున్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి అజహార్ కుమారుడితో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి వద్ద విద్య, హోం, క్రీడా శాఖలు ఉన్నాయి. అజహర్ స్వతహాగా క్రికెటర్ కాబట్టి అతడికి క్రీడా శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.