CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది. కీలకమైన ప్రచార ఘట్టం శనివారం(మే 11న) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మే 13న పోలింగ్ జరుగనుంది. అన్ని పార్టీలు ప్రచారంలో భాగంగా సభలు, రోడ్‌షోలపై దృష్టిపెట్టాయి. పోలింగ్‌కు ముందు రోజు చేయాల్సిన పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు మరో గట్టి షాక్ ఇవ్వడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తమతో టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈమేరకు సమాచారం లీక్ కావడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలైంది.
హైకమాండ్‌కు సమాచారం..
తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంపై టీపీసీసీ నేతలు ఇప్పటికే అధిష్టానానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే చేర్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు చేర్చుకుంటే.. దాని ప్రభావం కాంగ్రెస్ ఓట్లపై పడుతుందా అని అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. చేర్చుకోవడం వలన కాంగ్రెస్‌కు లాభం కలుగుతుందా అన్న విషయాలపై కూడా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌పై సానుభూతి పెరిగితే కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
చేరేదెవరు?
తాజా ప్రచారం నేపథ్యంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేది ఎవరు అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యేలు ఎంతమంది, ఎమ్మెల్సీలు ఎవరు అని ఆరా తీస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు కూడా దీనిపై గుసగుసలాడుతున్నారు. ఉత్తర తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు, గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీ భవన్‌లో ప్రచారం జరగుతోంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరతారన్న లీకులు ఇటు బీఆర్‌ఎస్‌ను టెన్షన్ పెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం తమను మరింత బలహీన పరుస్తుందని ఆందోళన చెందుతున్నారు.