MLA Prakash Goud: బీఆర్‌ఎస్‌ను వీడనున్న మరో ఎమ్మెల్యే.. అధికార పార్టీలో చేరిక!

జీహెచ్‌ఎంసీ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోనే చేరికలను హస్తం పార్టీ ప్రోత్సహిస్తోంది.

Written By: Raj Shekar, Updated On : April 19, 2024 1:08 pm

MLA Prakash Goud

Follow us on

MLA Prakash Goud: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని గులాబీ నేతలే అంటున్నారు. పదేళ్లు పార్టీలో ఉండి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నవారు. మంత్రులుగా పనిచేసినవారు, వివిధ పదవుల అనుభవించిన వారు బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. అధికారం ఎక్కడుంటే తాము అక్కడే అన్నట్లు.. గతంలో బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ నాయకులు సైతం.. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడితోపాటు జెడ్పీ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ చైర్మన్లు కాంగ్రెస్‌ గూటికి చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

సీఎంను కలిసిన ప్రకాశ్‌గౌడ్‌..
జీహెచ్‌ఎంసీ పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోనే చేరికలను హస్తం పార్టీ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరి సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ తెచ్చుకున్నారు. తర్వాత స్టేషన్‌ఘణపూర్‌ ఎమ్మెల్యే తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యతో కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత కడియం కూతురుకు కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చింది. ఇక తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరారు. ఈ ముగ్గురూ బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇప్పటికే ఒకసారి సీఎం రేవంత్‌ను కలిసిన ప్రకాశ్‌గౌడ్, తాజాగా శుక్రవారం మరోమారు కలిశారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరతానని సీఎంకు తెలిపారు.

నేడో రేపో చేరిక..
రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ చేరికకు సీఎం రేవంత్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో తన అనుచరులతో సమావేశం నిర్వహించి శని లేదా ఆదివారం హస్తం పార్టీలో చేరతారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టింది. ఈ క్రమంలో ప్రకాశ్‌గౌడ్‌తోపాటు పలువురు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది.