Site icon OkTelugu

MLA Komatireddy Rajagopal Reddy: ఆ 20 మంది తెలంగాణను దోచుకుంటున్నారు.. మునుగోడు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

MLA Komatireddy Rajagopal Reddy: స్వపక్షంలో విపక్షం అంటుంటాం కదా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది కనిపిస్తూ ఉంటుంది. సహజంగానే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది. నేతలకు విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. పెత్తనం కోసం పాకులాడటం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంటుంది. నేతలు ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం వల్ల.. పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారాలు బయటపడుతుంటాయి. కొన్ని సందర్భాలలో ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు కూడా బయటికి వస్తుంటాయి. దీంతో అటు ప్రతిపక్షాలకు.. ఇటు మీడియాకు కావలసినంత సరుకు దొరుకుతుంది.

తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని సుస్థిరం చేసుకోవడానికి అడుగులు వేయాల్సిన పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం పాకులాడుతున్నారు. కొంతమంది మంత్రి పదవులు రాకపోవడంతో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఆరోపణలు చేస్తున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆయన తన నియోజకవర్గంలో సాయంత్రం పూట మాత్రమే వైన్ షాపులు నిర్వహించాలని అల్టిమేటం జారీ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వని అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వంపై కూడా అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసారు. తెలంగాణ ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలను బయటపెట్టారు. ఏకంగా 20 మంది ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు తెలంగాణ ఖజానా మొత్తాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. వారి వివరాలు మొత్తం తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్న వారి వివరాలు కూడా తన వద్ద ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంతకాలం నుంచి రాజగోపాల్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు.. అందువల్లే ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చివరికి తన నియోజకవర్గ కేంద్రంలో వైన్ షాప్ ల ఏర్పాటు, నిర్వహణ విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి “సీతయ్య” మాదిరిగా వ్యవహరిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీ, దాని అనుబంధ సోషల్ మీడియా విపరీతంగా సర్కులేట్ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కానీ.. ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిబంధకంగా మారుతున్నాయి.

Exit mobile version