Pregnancy Termination
Pregnancy Termination: తెలంగాణలో సూర్యపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీ నగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని(26) ఇటీవల మృతిచెందింది. దీంతో ఆ జిల్లాలో లింగ నిర్ధారణ, గర్భ విచ్ఛిత్తి ఎంతలా సాగుతుందో తెలియజేసింది. జిల్లాలో కొంత మంది వైద్యరంగంలో మాఫియాగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు కన్ని రోజులు హడావుడి చేస్తున్నారు. తర్వాత చూసీ చూడనట్లు వ్యవహిస్తున్నారు. దీంతో సూర్యపేట జిల్లా లింగ నిర్ధారణకు, అబార్షన్లకు కేరాఫ్‌గా మారింది.
పట్టుబడినా.. ఆగని దందా..
సూర్యపేట జిల్లా కేంద్రంలోని కొన్ని ఆస్పత్రులు భ్రూణ హత్యలకు ప్రసిద్ధ చెందాయి. ఇటీవల కోదాడ ప్రాంతంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఆర్‌ఎంపీలు మీడియేటర్లుగా ఉంటూ ఈ దందా సాగిస్తున్నారు. తద్వారా ఇటు ఆస్పత్రులు లక్షల్లో, ఆర్‌ఎంపీలు వేలల్లో సంపాదిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చిన్న చిన్న క్లీనిక్‌లలో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పట్టుబడినా.. జరిమానాలు విధించినా.. కేసులు నమోదు చేసినా.. వెనక్కు తగ్గడం లేదు.
ఒకవైపు అవగాహన.. మరోవైపు ఉల్లంఘన..
భ్రూణ హత్యలను నియంత్రించేందకు ప్రభుత్వం పీసీ–పీఎన్‌డీటీ(ప్రీ కన్‌సెప్షన్, ప్రీ నెటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్) చట్టంపై ప్రజలకు అవాహన కల్పిస్తున్నారు. ఈమేరు రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఇక సూర్యపేట జిల్లాలో ఈమేరకు కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామీణులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. చట్ట ప్రకారం లింగ నిర్ధారణ చేసే వారికి, స్కానింగ్ నిర్వహించే వైద్యులకు, కుటుంబాలకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. అయితే సూర్యపేట జిల్లాలో ఈ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారులు హెచ్చరికలకే పరిమితం కావడంతో నిర్వాహకులు వాటిని లెక్కచేయడం లేదని తెలుస్తోంది.
ఇటీవల కొన్ని చర్యలు..
ఇదిలా ఉంటే.. లింగనిర్ధారణ, అబార్షనుల చేసే ఆస్పత్రులపై అధికారుల కొరడా ఝళిపిస్తున్నారు.
– ఏడాదిన్నర క్రితం సూర్యాపేటలోని ఓ వైద్యురాలు గర్భవిచ్ఛిత్తి చేస్తున్నట్లు గుర్తించారు. ఆమెకు జరిమానా విధించారు.
– ఏడాది క్రితం ఎంజీ రోడ్డులోని ఓ క్లినిక్‌లో మహిళలకు ఆబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి క్లినిక్ సీజ్ చేశారు.
– రామలింగేశ్వర థియేటర్ రోడ్డులోనూ మరో ప్రైవేటు ఆస్పత్రిని ఇదే కేసులో సీజ్ చేశారు.
పేర్లు మార్చి మళ్లీ దందా..
ఇలా అధికారులు చర్యలు తీసుకుంటుంటే నిర్వాహకుల మాత్రం పేర్లు మార్చి మళ్లీ కొత్తగా నిర్వహిస్తున్నారు. అందులోనూ అదే దందా కొనసాగిస్తున్నారు. దీంతో అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా లింగనిర్ధారణ, భ్రూణహత్యలు కొనసాగుతున్నాయి.
ఆడపిల్లలపై వివక్ష…
ఆడపిల్లలను ఇప్పుడు లక్ష్మీదేవిగా భావిస్తున్నారు. చాలా మందిలో ఈమేరకు అవగాహన వచ్చింది. అయినా సూర్యపేట జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతోంది. అందుకే ఈ జిల్లాలో స్త్రీపురుష నిష్పత్తి తగ్గుతోంది. ముఖ్యంగా గ్రామీణులు, తండాల ప్రజలు ఆడపిల్లలను వద్దనుకుంటున్నారు. చదువుకున్నవారు కూడా ఆడపిల్లలపై వివక్ష చూపుతున్నారు. దీంతో గర్భంలోనే ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఇక కొన్ని వివాహేతర సంబంధాల కారణంగా గర్భ విచ్ఛిత్తి చేస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
View Author's Full InfoWeb Title: Pregnancy termination in suryapet district