TPCC: తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. కొత్త అధ్యక్షుడి ఎన్నికకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ పదవీకాలం ఈ నెలతో పూర్తవుతుంది. ప్రస్తుతం సీఎంగా, టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పీసీసీ పగ్గాలు మరొకరికి ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కూడా అధిష్టానానికి విన్నవించారు.
లోక్‌సభ ఎన్నికల ముందు నుంచే కసరత్తు..
టీపీసీసీ చీఫ్ ఎన్నికల కోసం అధిష్టానం లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే కసరత్తు చేస్తోంది. అయితే ఎన్నికలు పూర్తయ్యే వరకు రేవంత్‌రెడ్డినే కొనసాగించాలని భావించింది. దీంతో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అధ్యక్షుడిని అధిష్టానం ప్రకటిస్తుందని అంతా భావించారు. కానీ మళ్లీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో అధిష్టానం పెద్దలు పలుమార్లు చర్చించారు.
రేసులో పలువురు..
కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ ఎంపిక కసరత్తు మొదలు పెట్టగానే ఆశావహులు హస్తినబాట పట్టారు. ఈ క్రమంలో అధిష్టానం సీనియర్ నేతల మధుయాష్కీగౌడ్, మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, బలరాం నాయక్, సీతక్క తదితరుల పేర్లు పరిశీలిస్తోంది. సీఎంకు సానుకూలంగా ఉండేవారిని నియమిస్తే ఎలాంటి ఇబ్బందులు రావని అధిష్టానం భావిస్తోంది.
అతడివైపే అధిష్టానం మొగ్గు..
మహేశ్‌కుమార్‌గౌడ్ అయితే.. అందరినీ కలుపుకుపోతాడని, సీఎంతో కలిసి పనిచేస్తాడని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా మహేశ్‌కుమార్‌గౌడ్, సీతక్క పేర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధిష్టానం మహేశ్‌కుమార్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో మహేశ్‌కుమార్‌గౌడ్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. బీసీ నేత కావడం, ఎన్‌ఎస్‌యూఐ నుంచి పనిచేస్తుండడంతో మహేశ్‌కమార్‌గౌడ్ అయితేనే బాగుంటుందని అధిష్టానం డిసైడ్ అయినట్లు తెలిసింది. ఆషాఢ మాసం తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.