Sircilla : సిరిసిల్ల.. ఈ పేరు చెప్తే చేనేత వస్త్రాలను గుర్తుకు వస్తాయి. సాగునీటి వనరులు మదిలో మెదులుతాయి..ఇసుక రీచ్ లు కళ్ళ ముందు కదలాడుతాయి. అలాంటి ఈ ప్రాంతంలో ఇప్పుడు సరికొత్త విషయం వెలుగు చూసింది. శాస్త్రవేత్తల పరిశోధనలు ఈ ప్రాంతంలో అరుదైన ఖనిజాలు వెలుగు చూసాయి. దీంతో రాష్ట్ర గనుల శాఖ మరింత లోతుగా పరిశోధన చేసేందుకు అడుగులు వేస్తోంది. కొత్తపల్లి – మనోహరాబాద్ రైలు మార్గం నిర్మిస్తుండగా.. జరుపుతున్న తవ్వకాలలో ఈ ఖనిజ సంపద వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరిందని తెలుస్తోంది. కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే లైన్ లో భాగంగా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తయింది. ఈ రైల్వే లైన్ నిర్మిస్తున్న క్రమంలో సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పలు మట్టి నమూనాలను అధికారులు సేకరించి.. తదుపరి పరీక్ష నిమిత్తం పంపించారు.
ఈ నమూనాలలో అత్యంత విలువైన ఖనిజా సంపద ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో మరింత లోతుగా పరిశోధన మొదలుపెట్టారు. ఎందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర గనుల శాఖ కేంద్రానికి నివేదికలు పంపించింది. 562.47 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఖనిజ సంపద సిరిసిల్ల జిల్లాలో విస్తరించి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో కొంత సిద్ధిపేట జిల్లాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఖనిజ సంపదలో 15 రకాల లాంతనైడ్స్ ఉన్నాయి. స్కాన్డియం, వేట్రియం వంటి ఖనిజాలు ఉన్నాయి. వేట్రియం బహిరంగ మార్కెట్లో కిలో 32వేలకు పైగా పలుకుతోంది. సిద్దిపేట జిల్లాలోని విటలాపురం, సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని పెద్ద లింగాపూర్, బస్వాపూర్, లక్ష్మీపూర్ గుట్టల్లో అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. వీటి ద్వారా అరుదైన ఖనిజ సంపద బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ భారీ స్థాయిలో ఖనిజాలు ఉంటే..ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్కాన్డియం, వేట్రియం వంటి ఖనిజాలను అంతరిక్ష పరిశోధనలో ఉపయోగిస్తారు. ఇక్కడ లభ్యమైన ముడి ఖనిజాలను శుద్ధి చేసి.. రాకెట్లు, ఉపగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు. వీటికి వెస్ట్రన్ కంట్రీస్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. స్కాన్డియాన్ని వజ్రాల శుద్ధి, వివిధ రకాలైన ఆమ్లాల తయారీలో ఉపయోగిస్తారు. న్యూక్లియర్ రియాక్టర్ల ఇంధనం లోనూ స్కాన్డియంను ఉపయోగిస్తారు. ఒకవేళ ఇక్కడ భారీ స్థాయిలో గనుక ఖనిజాలు ఉంటే.. కేంద్రం కచ్చితంగా వెలికితీస్తుందని ప్రచారం జరుగుతోంది. అపరమైన ఖనిజ సంపద ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. స్థానికులు కూడా తెగ చర్చించుకుంటున్నారు. పరిశోధకులకు ఈ ప్రాంతంలో ఉన్న గుట్టలను, భూములను చూపిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం ధర 40 నుంచి 50 లక్షల వరకు పలుకుతోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More