Mulugu Waterfall Rescue: వర్షాకాలం ప్రారంభం కావడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని జలపాతాలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. అయితే మారుమూల ప్రాంతాల్లో ఉన్న కొన్ని జలపాతాలు ఆకర్షిస్తాయి. కానీ ఇక్కడికి వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వాటిని గుర్తించి పోలీసులు కొన్ని జలపాతాల వద్దకు వెళ్లేందుకు నిషేధించారు. అయితే కొంతమంది యువత మాత్రం ఇక్కడికి వెళ్లి.. సరదాగా గడపాలని అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో అడవిలో చిక్కుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందంటే?
ములుగు జిల్లలో బొగత జలపాతం గురించి అందరికీ తెలసిన విషయమే. వర్షాకాలంలో ఇక్కడ అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అయితే ఈ జిల్లాలో కేవలం బొగత మాత్రమే కాకుండా మరెన్నో జలపాతాలు ఉన్నాయి. కానీ ఇక్కడికి వెళ్లేందుకు అనువైన రవాణా మార్గం లేదు. అంతేకాకుండా అక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. దీంతో వాటిని నిషేధించారు. అలా నిషేధం ఉన్న జలపాతాల్లో గుడి చెరువు జలపాతం ఒకటి.
Also Read: పోలీసులు తీసుకెళ్లిన ఇంట్లోనే బర్త్‌డే చేసుకున్న కేటీఆర్
ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని బొల్లారం అడవిలో ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు వరంగల్ నిట్ లో చదువుతున్న కొందరు విద్యార్థులు ఇక్కడికి వెళ్లారు. వీరిలో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నాయి. శనివారం సాయంత్రం ఇక్కడికి కారులో వచ్చారు. అయితే గుడి చెరువు జలపాతం వద్దకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో చీకటి పడింది. దీంతో దారి తప్పారు. ఈ క్రమంలో భయాందోళన చెందిన వారు 100 కు డయల్ చేశారు. దీంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మొబైల్ సిగ్నల్ ఆధారంగా వీరిని మొత్తానికి పట్టుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు సిబ్బంది కష్టపడి వీరిని పట్టుకొని బొల్లారం గ్రామానికి తీసుకొచ్చారు.
ఈ సందర్బంగా పోలీసులు వారిని మందలించారు. స్నేహితులతో సరదాగా జలపాతాలకు వెళ్లడం సబబే. కానీ నిషేధిత జలపాతాల వద్దకు వెళ్లడంపై కొందరు ఆగ్రహిస్తున్నారు. అంతేకాకుండా సాయంత్రం సమయంలో ఇలా అటవీ ప్రాంతానికి రావడంపై కొందరు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇలా రావడంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది తల్లిదండ్రులు అప్రమత్తం అయ్యారు. తమకు దూరంగా చదువుతున్న తమ పిల్లల గురించి ఆరా తీశారు. అలాగే నిట్ లో చదువుతున్న వారికి తల్లిదండ్రులు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు.
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
అయితే జలపాతాల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున… విద్యార్థులు, యువత ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నిషేధిత జలపాతాల వద్దకు వెళితే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంట్లో వారికి లేదా సంబంధిత కళాశాల యాజమాన్యానికి తెలియజేయాలన్నారు.