KTR CM Ramesh Clash: రాజకీయాలలో స్నేహాలకు ఆస్కారం ఉండదు. బంధాలకు విలువ ఉండదు.. మాటలకు చెల్లుబాటు ఉండదు.. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అన్నట్టుగానే రాజకీయాలలో ఉంటుంది. అందుకే రాజకీయ నాయకులు తమ అవసరాలకు తగ్గట్టుగా నడుచుకుంటారు.. తమ అవసరాల కోసం ఎంత దాకైనా వెళ్తారు. తమ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు. అందుకే రాజకీయాలనేవి సిద్ధాంతాల పరంగా, విధానాలపరంగా గొప్పగా అనిపించవు. అవసరాల తక్కెడలో మాత్రమే రాజకీయాలు ఇమిడిపోతాయి. కొంతమంది రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతారు. కులాల కుంపట్లు రగిలిస్తారు. మతాల మంటలు అంటిస్తారు. ఆ తర్వాత వాటి వేడిలో వారు చలి కాచుకుంటారు. ముందుగానే చెప్పినట్టు రాజకీయాలలో కేవలం స్వప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఇందుకోసం రాజకీయ నాయకులు ఏమైనా చేస్తారు. ఎవరినైనా బలి పెడతారు.
Also Read: జాగృతి లీడర్.. కవిత అడుగులు దేన్ని సూచిస్తున్నాయి..
కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో ఢిల్లీ జైలుకు వెళ్ళినప్పుడు రాజకీయ పరిణామాలలో ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయో తెలియదు. ఆమెకు బెయిల్ తీసుకురావడానికి.. కేంద్ర దర్యాప్తు సంస్థలను నిశ్శబ్దంగా ఉంచడానికి ఏకంగా కేటీఆర్ బిజెపిలో భారత రాష్ట్ర సమితి మెర్జ్ చేయడానికి ఆఫర్ ఇచ్చారట. ఈ వ్యవహారం మొత్తం బిజెపి ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో జరిగిందట. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్దలు కేటీఆర్ ప్రతిపాదనను వద్దనుకున్నారట. పైగా భారత రాష్ట్ర సమితి మునిగిపోయిన పార్టీ అని.. దానిని విలీనం ఎందుకు చేసుకోవాలని ఎదురు ప్రశ్నించారట. ఈ విషయం ఇన్నాళ్లకు ఎందుకు బయటకు వచ్చిందంటే.. సీఎం రమేష్ పై కేటీఆర్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఆయన కంపెనీకి రేవంత్ ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టిందని ఆరోపించారు. దీని విలువ 1600 కోట్లకు పైచిలుకు ఉంటుందని మండిపడ్డారు.
కేటీఆర్ చేసిన విమర్శల పట్ల సీఎం రమేష్ కూడా ఘాటుగానే స్పందించారు. “నాడు నువ్వు నా ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయావా.. నీ సోదరి మద్యం కేసులో ఉన్నప్పుడు బెయిల్ కోసం నన్ను ప్రాధేయపడిన విషయం గుర్తులేదా.. ఫ్యూచర్ సిటీలో నా కంపెనీకి కాంట్రాక్టు నిబంధనల ప్రకారం వచ్చింది. అంతేతప్ప లాబీయింగ్ చేస్తే రాలేదు. అలా అనుకుంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తుపాకులగూడెం వద్ద మా కంపెనీ ఆధ్వర్యంలో ఎత్తిపోతల పథకం నిర్మించాం. అప్పుడు మీరు మాకు ఏ విధంగా పనులు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన మాకు పనులు కేటాయించారు?” అని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు.
Also Read: బీఆర్ఎస్, బీజేపీ విలీనం.. కేటీఆర్ ఇప్పుడేమంటారు?
అప్పట్లో కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చినప్పుడు వీడియోలు ఉన్నాయని.. సీసీ కెమెరాలో ఇవన్నీ రికార్డ్ అయ్యాయని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో చెప్పినట్టుగా సీఎం రమేష్ ఆ వీడియోలను బయట పెడతారా? ఆ వీడియోలను బయట పెడితే కేటీఆర్ ఎలాంటి సమాధానం చెబుతారు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది. “2014 నుంచి 2023 వరకు కేటీఆర్ ఎక్కడెక్కడికి వెళ్లారు? ఏ దేశాలలో పర్యటించారు? ఎవరిని కలిశారు? అనే విషయాలపై నేను చర్చకు సిద్ధమని.. కీలక విషయాలను బయటపెడతానని” రమేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవేళ సీఎం రమేష్ గనక ఆ వీడియోలను బయట పెడితే అందరి రంగులు తెలుస్తాయని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.