Mulugu District Official: ఒకప్పుడు పై స్థాయి అధికారులు లంచాలు తీసుకోవాలంటే భయపడేవారు. కొందరైతే ముడుపులు ఇవ్వడానికి వచ్చిన వారిని తిట్టేవారు. అటువంటి వారి వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పై స్థాయి అధికారులు భారీగా లంచాలకు మరిగారు. ఈ శాఖ ఆ శాఖ అని తేడా లేకుండా అన్ని శాఖల అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. చివరికి ప్రభుత్వాన్ని మించిపోయి తామే ఒక సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు. డబ్బులు వసూలు చేయడానికి ఏకంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని దందాలు సాగిస్తున్నారు.
అధికారులలో అవినీతి వ్యవహారం అడ్డగోలుగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి నిరోధక శాఖకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా లంచాలు తీసుకుంటూ చాలామంది అధికారులు దొరికిపోతున్నారు. రెవెన్యూ నుంచి మొదలుపెడితే రిజిస్ట్రేషన్ల శాఖ వరకు అవినీతి వ్యవహారం అడ్డగోలుగా సాగుతోంది. ఏసీబీ అధికారులు విస్తృతమైన స్థాయిలో దాడులు చేస్తున్నప్పటికీ.. అధికారుల తీరు మారడం లేదు. పైగా లంచాలు వసూలు చేయడంలో సరికొత్త విధానాలను పాటిస్తున్నారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతూ అంతకుమించి ఆనే స్థాయికి ఎదుగుతున్నారు. కొందరు అధికారులు అయితే అధికార పార్టీతో అంట కాగుతూ.. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమంటున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కొంతమంది అధికారులు తాము రాజకీయ పార్టీలలో చేరి పోటీ చేయడానికి సిద్ధమైన సంకేతాలు పంపించారు.
ఇప్పుడు ఇక తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో పత్తినూతస్థాయిలో పనిచేస్తున్న ఒక అధికారి హైదరాబాద్ శివారు మోకిలా అనే ప్రాంతంలో 20 కోట్ల వ్యయంతో అత్యంత విలాసవంతమైన విల్లాలను కొనుగోలు చేశారు. ఆయన పర్యవేక్షిస్తున్న శాఖ లో ఉద్యోగులకు సంబంధించిన టి ఏ, డీఏ లను ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఆ ప్రాంతంలో దాతల సహకారంతో ఒక క్రీడా మైదానాన్ని నిర్మిస్తే.. తప్పుడు లెక్కలు ప్రభుత్వానికి చూపించి లక్షలకు లక్షలు దండుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ అధికారి వ్యవహారం ఇప్పటికే ప్రభుత్వం వద్దకు వెళ్లిందని.. ఏసీబీ అధికారులు కూడా దృష్టి సారించారని తెలుస్తోంది. ఆయన ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వంతో క్లోజ్ గా ఉంటారని.. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుంటారని వినికిడి. అందువల్లే ఆయన అంతకంతకు ఎదుగుతున్నారని ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవినీతి నిరోధక శాఖకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ అధికారి వ్యవహారంపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారని.. త్వరలోనే ఆ అధికారి బండారం మొత్తం బయట పెడతారని ప్రచారం జరుగుతోంది.