Mojo TV Executive Editor Sanjay: ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే దాకా.. గల్లి నుంచి ఢిల్లీ దాకా జరిగిన సంఘటనలను జర్నలిస్టులు వార్తల రూపంలో సమాచారాన్ని సమాజానికి చేరవేరుస్తూ ఉంటారు. గ్రామంలో సర్పంచ్ నుంచి దేశంలో ప్రధానమంత్రి దాకా అందరి మీద వార్తలు రాస్తూ ఉంటారు. గొర్రెతోకబెత్తడు అనే సామెత లాగా.. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తారు.. ఈ జాబితాలో కొంతమంది ఇతర మార్గాల ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకున్నప్పటికీ.. అందరి రాతలు అలా ఉండవు. యాజమాన్యం చెప్పినట్టు వినాలి.. యాజమాన్యం నిర్దేశించిన టార్గెట్లు పూర్తి చేయాలి. యాజమాన్యానికి నచ్చని వారి మీద అడ్డగోలుగా వార్తలు రాయాలి. లేదా ప్రోగ్రామ్స్ రూపొందించాలి. స్థూలంగా చెప్పాలంటే యాజమాన్యం ఏం చెబితే అదే చేయాలి. ఇందులో సొంత నిర్ణయాలకు తావు ఉండకూడదు. ఒకవేళ ఉంటే రెండో మాటకు ఆస్కారం లేకుండా బయటకు వెళ్లిపోవాలి. ఇలా బయటకు వెళ్లడం ఇష్టం లేక, వేరే పని చేతకాక ముక్కీ మూలిగి జీవితాలను గడుపుతున్న వారు ఎంతోమంది. ఇక వీరిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లినవారు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అలా మోజో టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సంజయ్ కూడా బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనువు చాలించాడు.
ఎవరు సంజయ్ కుమార్ సింగ్?
సంజయ్ కుమార్ సింగ్ బిహారి నేపథ్యమున్నవాడు. ఇండియా టీవీలో పరిశోధనాత్మక స్టోరీలు అందించాడు. ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేశాడు. ” ఇది నా కల. పరిగెత్తడానికి శాయ శక్తులా ప్రయత్నించాను. ఇప్పుడు పరిగెత్తే శక్తి లేకుండా పోయింది. నాలో ధైర్యం పూర్తిగా చచ్చిపోయింది. ఇక ఉంటాను” అని ఒక లేఖ రాసి టేబుల్ పైన ఉంచాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. బిహారి నేపథ్యం ఉన్నప్పటికీ సంజయ్ ఒక విలక్షణ జర్నలిస్టు. ఇండియా టీవీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశాడు. ఢిల్లీ సర్కిల్లో గొప్ప జర్నలిస్టుగా గుర్తింపు పొందాడు. ఉన్నత విలువలు మెయింటైన్ చేశాడు. రిపబ్లిక్ టీవీ ఓనర్ అర్ణబ్ గోస్వామి ఇతడిని ఎంగేజ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అతడి ఫోల్డ్ లో పని చేసేందుకు సంజయ్ ఇష్టపడలేదు. భారీ ఆఫర్ ఇస్తామని ప్రకటించినప్పటికీ డబ్బులకు సంజయ్ లొంగలేదు.
రవి ప్రకాష్ పిలుపుతో
టీవీ9 నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్.. సంజయ్ కుమార్ పనితీరు నచ్చి అతడిని హైదరాబాద్ ఆహ్వానించాడు. అంతకుముందు తాను ప్రారంభించిన మోజో టీవీ పగ్గాలు అప్పగించాడు. ఇతడి సారధ్యంలో మోజో టీవీ కొద్ది రోజులపాటు బాగానే నడిచింది. తర్వాత టీవీ9 ను టేక్ ఓవర్ చేసిన ఓనర్లు మోజో టీవీ మీద కూడా కేసులు పెట్టారు. దీంతో ఆ చానల్ మూత పడింది. రమ్మని ఆహ్వానించిన రవి ప్రకాష్ తర్వాత ముఖం చాటేసాడు. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సంజయ్ కుమార్ కు పరిచయాలు తగ్గిపోయాయి. అప్పట్లో తనతో ఉన్నవారికి ఫోన్ చేస్తే అటెండ్ చేయలేదు. ఇక అప్పటినుంచి సంజయ్ హైదరాబాదులోనే ఉండిపోయాడు. ఈలోగా తన భార్యకు రొమ్ము క్యాన్సర్ సోకింది. చేతిలో చిల్లిగవ్వలేదు. సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. లోగా ఇద్దరు ఇన్వెస్టర్స్ రావడంతో హైదరాబాదులో ఒక ఆఫీస్ ప్రారంభించాడు. యూట్యూబ్ ఛానల్ కు శ్రీకారం చుట్టాడు. వచ్చిన పెట్టుబడులతో ఛానల్ పనుల కన్నా అప్పులు తీర్చుకోవడం పైనే సంజయ్ దృష్టి సారించడంతో.. ఆ పెట్టుబడులు పెట్టినవారు దూరం జరిగారు. చాలామందిని సంజయ్ కలిశాడు. ఉపయోగం లేకుండా పోయింది. జీవితం మీద విరక్తి పెరిగింది. పిరికి ఆలోచనలు పెరిగిపోయాయి. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
వాస్తవానికి సంజయ్ కి దేశ రాజకీయాల మీద పట్టు చాలా ఎక్కువ. రకరకాల కాన్సెప్ట్ లతో స్టోరీలు వేసేవాడు. కానీ కుటుంబ బాధ్యతల విషయంలో భయం భయంగా ఉండేవాడు. ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసిన అతడు చివరికి ఇలా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా విషాదకరం..అదే సమయంలో ఢిల్లీ నుంచి ఇతడిని హైదరాబాద్ కు రప్పించిన రవి ప్రకాష్ ఆపత్కాలంలో చేతులెత్తేయడం మరింత బాధాకరం. అలాంటి రవి ప్రకాష్ ఇప్పుడు ఆర్ టీవీ పేరుతో ఒక ఛానల్ ప్రారంభించాడు. దీనికి సంబంధించి ఉద్యోగులను కూడా నియమించుకుంటున్నాడు. మరి వీరికి ఎలాంటి న్యాయం చేస్తాడో, అవసరం తీరిన తర్వాత సంజయ్ సింగ్ లాగానే వదిలించుకుంటాడో వేచి చూడాల్సి ఉంది.