Revanth Reddy- Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో భారీ సంచలనం! అమిత్ షా పర్యటనకు కొద్దిసేపటికి ముందే కాంగ్రెస్ పార్టీ సరైన సమయంలో చక్రం తిప్పింది. దీంతో ఏం జరుగుతుందోనని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్ శ్రీకారం చుట్టిన ఆ సంఘటన ఏంటంటే.. కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి బహిష్కృత నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసంలో భేటీ అయ్యారు. మీడియా ప్రతినిధులను ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి శ్రీనివాసరెడ్డి చేరడం దాదాపు ఖాయం కావడంతో.. వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. పార్టీలో ఎవరెవరు చేయబోతున్నారు అనే విషయం మీద ఒక అంగీకారం వచ్చింది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తో భేటీలో అనేక విషయాల మీద పొంగులేటి ఒక స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఖమ్మం లేదా హైదరాబాదులో..
పొంగులేటి తన అనుచరగణంతో కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఆశించిన వారిలో కలవరం మొదలైంది. ఇన్ని రోజులు తమకే టికెట్లు దక్కుతాయని భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి వర్గీయులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పొంగులేటి, ఆయన ద్వారా చేరే వారితో ఎక్కడ సమీకరణాలు మారుతాయోనని, తమ ఆశలకు ఎక్కడ గండి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో పొంగులేటి, ఆయన వర్గీయులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఈ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా మధిర నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యేగా పొదెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పినపాక నియోజకవర్గం నుంచి గెలిచిన రేగా కాంతారావు, పాలేరు నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు నుంచి గెలిచిన బానోత్ హరిప్రియ, కొత్తగూడెం నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు.. పార్టీ ఫిరాయించారు. వీరు మొత్తం భారత రాష్ట్ర సమితిలో చేరారు. అయితే వీరు గులాబీ కండువా కప్పుకోవడంతో ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చెందిన కొంతమంది నాయకులు అభ్యర్థిత్వం దక్కుతుందని ఆశపడ్డారు. పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. అయితే ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వర్గం నుంచి మొత్తం పది నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉంటారని ప్రకటించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు కూడా నిర్వహించి పేర్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరితే.. అధిష్టానం పొంగులేటికీ ఉన్న పలుకుబడికి తలొగ్గి ఆయన వర్గీయులకు అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఉన్నారు. పొంగులేటి కూడా తాను కాంగ్రెస్లో చేరాలంటే తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ రేవంత్ రెడ్డి ముందు ఉంచారని ప్రచారం జరుగుతున్నది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారని, ఇద్దరి మధ్య జరిగిన భేటీలో ఇదే ప్రముఖంగా చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
పొంగులేటి వర్గం నుంచి వీరే
ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పొంగులేటి.. పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట నుంచి జారె ఆదినారాయణ, ఇల్లందు నుంచి జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, వైరా నుంచి బానోత్ విజయాబాయి, సత్తుపల్లి నుంచి రిటైర్డ్ పీఆర్ ఈఈ సుధాకర్ రావు పేర్లను ఆయన ప్రకటించారు. ఇక పొంగులేటి కొత్తగూడెం మీద ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇక పాలేరులో వైయస్ షర్మిల కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉంటారని, అందుకు తనవంతుగా ప్రచారం చేస్తానని రేవంత్ రెడ్డి ఎదుట పొంగులేటి ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఇదే జరిగితే ప్రస్తుతం పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వరావుపేట నియోజకవర్గాల్లోని భట్టి, రేణుక వర్గీయుల ఆశలు గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు.. పది సంవత్సరాలుగా అధికారంలో లేకపోయినప్పటికీ తాము పార్టీ నే అంటిపెట్టుకొని పనిచేస్తున్నామని, ఇలాంటి సమయంలో తమ టిక్కెట్ వేరే వారికి ఇస్తే తమ పరిస్థితి ఏంటని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అదృష్టాన్ని మాత్రం వర్గాల వారీగా టికెట్లు ఉండవని, సర్వేల ఆధారంగానే గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్లు ఇస్తామని చెబుతోంది. ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తన వెంట తిరిగి సమయాన్ని వృధా చేసుకోవద్దని, తన టికెట్ కే గ్యారంటీ లేదని సంచలన ప్రకటన చేశారు. మరి ఇలాంటి క్రమంలో పొంగులేటికి, రేవంత్ ఎలాంటి భరోసా ఇచ్చాడు అనేది ఇప్పుడు తెలుగు నాట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.