MLC Kavitha: కవిత.. తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ ఉద్యమ సారథి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ. 2019లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండేళ్లు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. దీంతో కేసీఆర్ కూతురు పరిస్థితి చూడలేక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నిక చేయించారు. దీంతో రెండేళ్లుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో పేరు..
ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈమేరకు ఈడీ ఇప్పటికే ఆమెను రెండుసార్లు విచారణ కూడా చేసింది. సౌత్‌గ్రూప్‌ను కవితే లీడ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు ఈడీ కూడా పలు చార్జిషీట్లలో ఆమె పేరు ప్రస్తావించింది. ఫోన్లు మార్చారని పేర్కొంది. కవిత భర్త పేరును కూడా చార్జిషీట్‌లో ప్రస్తావించింది. దాదాపు కవిత అరెస్ట్ ఖాయం అనుకున్నారు. కానీ తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ కవిత అరెస్ట్ కాలేదు. దీంతో ఇప్పుడు ఆమె నిజామాబాద్ రాజకీయాలపై దృష్టిపెట్టారు.
ఆరు నెలలుగా నిజామాబాద్‌లోనే..
కవిత గత ఆరు నెలలుగా నిజామాబాద్‌లోనే ఉంటున్నారు. వివిధ కార్యక్రమాలు, సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం షురూ చేశారు. అన్న కేటీఆర్, బావ హరీశ్‌రావు కంటే ముందే కవిత నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ చుట్టేశారు.
సంఘాలతో మీటింగ్..
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కవిత కోరుతున్నారు. బహిరంగ సభలు నిర్వహించడంతోపాటు కుల సంఘాలు, మహిళా సంఘాలతోనూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ పథకాలను వివరిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈ క్రమంలో నిజాబాబాద్ జిల్లాలో సిట్టింగులందరికీ టికెట్టు ఇచ్చారు కేసీఆర్. కామారెడ్డి అభ్యర్థి గంప గోవర్ధన్ స్థానంలో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తన ఒత్తిడి కారణంగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిందని చెప్పుకుంటున్నారు.
లోక్‌సభ ఎన్నికలకు గ్రౌండ్ వర్క్..
ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం కవిత తీవ్రంగా శ్రమిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీని వెనుక 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. ఒకవైపు ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని పరోక్షంగా సంకేతం ఇస్తున్నారు.
కేసీఆర్ రాకతో పరిగిన బలం..
మరోవైపు కేసీఆర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలో గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి బరిలో దిగబోతున్నారు. ఇది పూర్తిగా తన కూతురు కోసమే అని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానాలను 9 స్థానాలు గెలిచినా.. లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయారు. దీంతో ఈసారి అలాంటి తప్పిదం జరుగకూడదనే కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా బరిలో దిరగుతానని ప్రకటించారు.
పసుపు బోర్డు ప్రకటనతో..
ఆరు నెలలుగా బీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేస్తున్న కవితకు, కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో ఎంపీ అర్వింద్ బాండ్ రాసి ఇచ్చిన పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభలో ప్రకటించారు. దీంతో కవిత ఆరు నెలల శ్రమ వృథా అయినట్లయింది. పసుపు బోర్డు ప్రకటనతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. పసుపు బోర్డు రాదని ఇప్పటికే ఫిక్స్ అయిన పసుపు రైతులు మోదీ అనూహ్య ప్రకటనతో ఒక్కసారిగా బీజేపీ వైపు మళ్లారు. అక్టోబర్ 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభకు లక్షలాదిగా తరలి రావడమే ఇందుకు నిదర్శనం.
పసుపు బోర్డు వచ్చిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత శ్రమ ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.