Malla Reddy: మల్లారెడ్డి మళ్లీ ఏసేశాడు.. రేవంత్‌ దేవుడి కరుణ కోసమేనా?

కాంగ్రెస్‌లో చేరడానికి స్థానిక నేతలు సానుకూలంగా లేరు. ఈ నేపథ్యంలో ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం ద్వారా కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బెంగళూరుకు వెళ్లి డీకే శివకుమార్‌ను కలిసి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Written By: Raj Shekar, Updated On : March 17, 2024 2:25 pm

Malla Reddy

Follow us on

Malla Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇబ్బంది ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి. బీఆర్‌ఎస్‌ నుంచి మేడ్చల్‌ బరిలో నిలిచి గెలిచిన మల్లారెడ్డి గెలిచినా.. ఆ పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. దీంతో మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. ప్రజావాణిలో మల్లారెడ్డి కబ్జాలు, దౌర్జన్యాలపై ప్రజలు, సంఘాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా మల్లారెడ్డిని ఎలా పట్టుకోవాలని చూస్తున్న రేవంత్‌ సర్కార్‌క ఈ ఫిర్యాదులే ఆధారమయ్యాయి. దీంతో మల్లారెడ్డి కబ్జాలపై ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తోంది. ఇటీవలే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి సంబంధించిన కళాశాల భవనాన్ని కూడా అధికారులు కూల్చివేశారు. కబ్జాలన్నీ బయలపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సీఎం సలహాదారుతో భేటీ..
మల్లారెడ్డి ఆస్తులపై దర్యాప్తు వేగవంతం కావడంతో ఆయన వెంటనే సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిశారు. తన ఆస్తులపై దాడులు జరుగకుండా సీఎంకు విన్నవించాలని కోరారు. కక్షసాధింపు చర్యలు సరికావని విన్నవించారు. అయితే వేం నరేందర్‌రెడ్డిని కలిసిన తర్వాత కూడా ఎలాంటి ఫలితం కనిపించలేదు. దీంతో కాంగ్రెస్‌లో చేరడానికి కూడా మల్లారెడ్డి సిద్ధమయ్యారు.

‘డీకే’తో భేటీ..
కాంగ్రెస్‌లో చేరడానికి స్థానిక నేతలు సానుకూలంగా లేరు. ఈ నేపథ్యంలో ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం ద్వారా కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల బెంగళూరుకు వెళ్లి డీకే శివకుమార్‌ను కలిసి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్‌ తన ఆస్తుల జోలికి రాకుండా చూడాలని విన్నవించినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో తాను, తన అల్లుడు రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లో చేరతామని కూడా ప్రతిపాదించారని సమాచారం. అయితే అక్కడి నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని సమాచారం.

సొంతంగా ప్రయత్నాలు..
ఇక వివిధ మార్గాల్లో చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మల్లారెడ్డి తానే స్వయంగా రేవంత్‌రెడ్డి ప్రసన్నం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రస్‌మీట్‌లో మాట్లాడారు. రేవంత్‌ సీఎం అవుతారని తాను 2014లోనే చెప్పానని వెల్లడించారు. బొల్లారంలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో దివంతగ ఎమ్మెల్యే సాయన్న ఇచ్చిన విందుకు హాజరైన సందర్భంలో తాను రేవంత్‌రెడ్డితో స్వయంగా మాట్లాడానని తెలిపారు. భవిష్యత్‌లో సీఎం అవుతావని చెప్పినట్లు గుర్తు చేశారు. ఈమేరకు నాటి వీడియోను కూడా విడుదల చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు అలా..
ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రసన్నం కోసం ప్రయత్నిస్తున్న మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేశారు. తొడగొట్టి సవాల్‌ చేశారు. రాయడానికి కూడా వీలుకాని పదాలు వాడారు. అధికారం పోవడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సీఎంను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో తాను వేరే పార్టీలోకి వెళ్లనని అంటున్నారు. గతంలో రేవంత్‌రెడ్డిపై తొడగొట్టి చేసిన వ్యాఖ్యలు రాజకీయపరమైనవే అని అంటున్నారు. వ్యక్తిగతంగా రేవంత్‌పై తనకు కోపం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు తాము మంచి మిత్రులమే అని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కుమారుడు భద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.